పచ్చని కుటుంబంపై విధి కన్నెర్ర

22 Sep, 2016 01:39 IST|Sakshi
పచ్చని కుటుంబంపై విధి కన్నెర్ర

 కేకే నగర్ : విధి ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మన జీవితాలతో ఆడుకుంటుందన్న విషయం ఎవరికీ తెలియదు. విధి ఆడిన నాటకంలో తల్లి, చెల్లిని మంటల్లో కోల్పోయిన ఓ చిన్నారి లగ్జరీ కారు రూపంలో వచ్చిన మృత్యువు ద్వారా తండ్రిని కూడా దూరం చేసుకుంది. ఇప్పడు ఏ నీడా లేక ఒంటరిగా అనాథగా మిగిలింది. తిరుత్తణి సమీపంలోని అకూర్ గ్రామానికి చెందిన ఆర్ముగం అదే ప్రాంతానికి చెందిన పుష్ప అనే యువతిని 2009లో వివాహం చేసుకున్నాడు. వీరికి మనీషా(07), రంజన(05) ఇద్దరు కుమార్తెలు. భార్య, కుమార్తెలు తిరుత్తణి, అకూర్‌లో నివసిస్తుండగా ఆర్ముగం చెన్నైలో ఉంటూ ఆటో నడిపేవాడు.
 
  రాత్రింబవళ్లు అద్దె ఆటో నడిపే ఆర్ముగంకు ఆటో యజమాని రోజుకు రూ.300 ఇచ్చేవాడు. ఈ సంపాదనతో ఆర్ముగం కుటుంబం ఆనందంగా గడిపేది . వీలైనప్పుడు ఆర్ముగం అకూర్‌కు వెళ్లి భార్య పిల్లలకు ఇష్టమైనవి కొనిచ్చి సంతోషపెట్టేవాడు. ఈ నేపథ్యంలో భార్యభర్తల మధ్య ఏర్పడిన కుటుంబ తగాదాల కారణంగా ఆర్ముగం భార్య పుష్ప గత మే నెలలో తన చిన్న కుమార్తె రంజనను చంపి ఆపై ఆత్మహత్య చేసుకుంది. తల్లి చెల్లిని కోల్పోయిన మనీషా తన అవ్వ మంజుల దగ్గర ఉంటోంది. భార్య కుమార్తెల మృతితో ఆర్ముగం దిక్కులేనివాడయ్యాడు. అయినా మనీషా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తిరిగి చెన్నై వ చ్చి ఆటో నడపడం ప్రారంభించాడు.
 
 అ క్రమంలో గత 18న ఆల్వార్‌పేట రాధాకృష్ణన్ రోడ్డుపై ఆటోలో నిద్రిస్తుండగా అతనిపై విధి రెండోసారి పంజా విసిరింది. వికాస్ అనే యువకుడు మద్యం మత్తులో కారు నడిపి రోడ్డు పక్కన నిలిపిఉన్న 12 ఆటోలను ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ఆటోడ్రైవర్లు తీవ్ర గాయాలు పాలయ్యారు. వారిలో ఆర్ముగం చికిత్సలు ఫలించక మృతి చెందాడు. దీంతో చిన్నారి మనీషా ఒంటరిగా మిగిలింది. మూడు నెలల క్రితం తల్లిని, చెల్లిని కోల్పోయి బాధలో ఉన్న చిన్నారి మనీషా తండ్రి మృతి చెందిన విషయాన్ని తట్టుకోలేక బోరున విలపిస్తోంది.
 
  నాన్న చెన్నై నుంచి ఎప్పుడు వస్తాడు? ఇంక రాడా? అంటూ అవ్వను ప్రశ్నించడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ఇలా ఉండగా ఆళ్వార్ పేటలో మద్యం తాగి అతివేగంగా కారు నడిపి ఆర్ముగం మృతికి కారకుడైన వికాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు భవిష్యత్తులో కారు రేస్‌లో పాల్గొనడానికి వీలులేదని ఫెడరేషన్ ఆఫ్ మోటర్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆదేశించింది.  విశాల్ ఉదారత : ప్రమాదంలో మృతి చెందిన ఆటో డ్రైవర్ ఆర్ముగం కుమార్తె మనీషా చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను దేవి ట్రస్ట్ ద్వారా భరిస్తానని నటుడు విశాల్ తెలిపారు. ఈ విషయమై ఆయన ఆర్ముగం ఇంటికి వెళ్లి మనీషా అవ్వ మంజులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.
 

Election 2024

మరిన్ని వార్తలు