నన్ను కెలకొద్దు!

30 Mar, 2018 10:10 IST|Sakshi

మంత్రికి వివేక్‌ హెచ్చరిక

ఎల్‌ఎల్‌బీ విద్యార్హత విషయంలో తన పరువును బజారు కీడ్చే రీతిలో, తన కుటుంబాన్ని హేళన చేస్తూ వ్యాఖ్యలు చేయడం మానుకోకుంటే, కోర్టు మెట్లు ఎక్కిస్తా అనిమత్స్య శాఖ మంత్రి జయకుమార్‌కు చిన్నమ్మ మేనల్లుడు వివేక్‌ హెచ్చరికలు చేశారు. తనను దయచేసి కెలకొద్దు అని హితవు పలికారు.

సాక్షి, చెన్నై : విదేశీ కోటాలో ఎల్‌ఎల్‌బీ సీటు పొంది.. దొడ్డి దారిలో చిన్నమ్మ శశికళ మేనల్లుడు, జయ టీవీ సీఈవో పట్టా పొందినట్టు ఏసీబీ గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను అరెస్టు చేయడానికి తగ్గ కసరత్తులు సాగుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ విషయంగా మత్స్య శాఖ మంత్రి జయకుమార్‌ నోరు జారారు. వివేక్‌ను ఉద్దేశించి, ఆయన కుటుంబాన్ని గురిపెట్టి విరుచుకుపడ్డారు. వివేక్‌ను అరెస్టుచేసి కటకటాల్లోకి నెట్టడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. ఆ కుటుంబమే మోసగాళ్ల కుటుంబంగా పేర్కొంటూ తీవ్రంగానే పదాలను ప్రయోగించారు. ఇది కాస్త వివేక్‌లో ఆగ్రహాన్ని రేపింది. జయకుమార్‌కు హెచ్చరికలు చేస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో మంత్రి అన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా జయకుమార్‌ మీద వివేక్‌ శివాలెత్తారు.

నన్ను కెలకొద్దు : తన గురించి జయకుమార్‌కు ఏం తెలుసునని, ఇష్టారాజ్యంగా నోరు జారుతున్నారంటూ మండిపడ్డారు. తానూ యూజీ ఆస్ట్రేలియాలోనూ, పీజీ పూణెలో పూర్తి చేసినట్టు వివరించారు. ఎవరి సహకారం, సిఫారసు లేకుండా స్వశక్తితో తాను ఐటీసీ సంస్థలో ఉద్యోగాన్ని సంపాదించి విధులు నిర్వర్తించానన్నారు. న్యాయ శాస్త్రం చదవాలన్న ఆశతో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశానన్నారు.  ఎన్నో కళాశాలలు ఉన్నా, డాక్టర్‌ అంబేడ్కర్‌ కళాశాలను తాను ఎంపిక చేసుకున్నానన్నారు. తనకు సింగపూర్‌ సిటిజన్‌ గుర్తింపు ఉందని, తన సోదరి అక్కడే ఉన్న దృష్ట్యా, తనకు కూడా అక్కడి పౌరుడిగా గుర్తింపు దక్కి ఉన్నట్టు వివరించారు. అందుకే తాను విదేశీ కోటాలతో సింగపూర్‌ పౌరసత్వం ఆధారంగా చేరానన్నారు. ఇందుకు తగ్గ ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయన్నారు. తనను ఎవరైనా అధికారులు ప్రశ్నిస్తే చట్టపరంగా అన్ని వివరాలను వారి ముందు ఉంచేందుకు సిద్ధం అన్నారు.

కేసులు పెడితే చట్టపరంగా ఎదుర్కొంటానన్నారు. అయితే, మంత్రి పదవిలో ఉన్న జయకుమార్‌ తనను, తన కుటుంబాన్ని టార్గెట్‌ చేసి, అనాగరికంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడ్డారు. తానేదో పెద్ద మోసాగాడినైనట్టు, పెద్ద నేరం చేసినట్టుగా అరెస్టు చేయిస్తా, కటకటాల్లో పెట్టిస్తా అని స్టేట్‌మెంట్లు ఇచ్చుకోవడం మానుకుంటే మంచిదని మంత్రిని హెచ్చరించారు. తనను కెలక వద్దు అని, కెలికిన పక్షంలో కోర్టు మెట్లు ఎక్కించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అధికారం చేతిలో ఉంటే  ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తారా..? బెదిరిస్తారా..? అని ధ్వజమెత్తారు.  తనను గాని, తన కుటుంబాన్ని గాని అవమాన పరిచే విధంగా గానీ, హేళన చేసే విధంగా గానీ, వ్యాఖ్యలు చేయడం మానుకోకుంటే , తీవ్రంగా తానూ స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇంకాచెప్పాలంటే, జయకుమార్‌ పబ్లిసిటీ కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. తనకు ఏమీ తెలియకున్నా, అన్ని తెలిసిన వాడి వలే ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం బట్టి చూస్తే, ఆయన పబ్లిసిటీ వ్యామోహం స్పష్టం అవుతోందని విమర్శించారు.  

మరిన్ని వార్తలు