పళని విశ్వాస పరీక్షపై రాష్ట్రపతికి నివేదిక

23 Feb, 2017 02:53 IST|Sakshi

- ఇప్పటికే పంపిన గవర్నర్‌ విద్యాసాగర్‌రావు
-  ‘అసెంబ్లీలో’ ఆరోపణలపై డీఎంకేను ఆధారాలు చూపాలన్న కోర్టు


చెన్నై/ సాక్షి ప్రతినిధి, చెన్నై:
తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా ఈ నెల 18న అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఆ రాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు నివేదిక పంపారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా.. తమిళనాడు అసెంబ్లీలో నిబంధనలకు విరుద్ధంగా విశ్వాస పరీక్ష జరిగిందన్న దానిపై వీడియో క్లిప్పింగ్‌లుగాని, ఇతర ప్రామాణికాలుగాని సమర్పించాలని ప్రతిపక్ష డీఎంకేకు మద్రాస్‌ హైకోర్టు సూచించింది.  విశ్వాస పరీక్షను రద్దు చేయాలంటూ ఈ నెల 20న డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హులువాది జి రమేశ్, జస్టిస్‌ ఆర్‌ మాధవన్‌లతో కూడిన ధర్మాసనం డీఎంకే ఆరోపణలపై ఆధారాలను సమర్పిం చాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

ప్రజాస్వామ్యం ఖూనీ: స్టాలిన్‌
తమిళనాడు అసెంబ్లీలో అన్నా డీఎంకే సభ్యులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, విపక్ష నేత స్టాలిన్‌ విమర్శించారు. అసెంబ్లీ సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలకు నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు జరిపారు. తిరుచ్చి తెన్నూర్‌ ఉళవర్‌ సంత మైదానంలో జరిగిన నిరాహార దీక్షలో స్టాలిన్‌ ప్రసంగిస్తూ.. పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్‌ ధనపాల్‌ అధికార పార్టీ సభ్యుడిగా మారిపోయారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు