ఆత్మహత్య చేసుకోవాలని ఉంది..

7 Oct, 2016 00:17 IST|Sakshi

ఎల్.ఎన్.పేట: మండలంలో అధికార పార్టీకి చెందిన నాయకుల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకోవాలని ఉందంటూ ఇన్‌చార్జి తహశీల్దారు జి.వి.నారాయణమూర్తి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ ఒమ్మి కృష్ణవేణి అధ్యక్షతన గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో విలపించారు. రేషన్ కార్డులు, యూనిట్ల తొలగింపు విషయమై సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతున్న సమయంలో ముంగెన్నపాడు పంచాయతీ సర్పంచ్ యారబాటి రాంబాబు తన పంచాయతీలోని సమస్యలపై ఇన్‌చార్జి తహశీల్దారును ప్రశ్నించారు.
 
 ముంగెన్నపాడు కాలనీలో ఆక్రమణలు ఎందుకు తొలగించలేదంటూ నిలదీశారు. ఎమ్మెల్యే చెప్పినా జాప్యం చేస్తున్నారంటూ సర్పంచ్ మండిపడ్డారు. ఈ సమయంలో భావోద్వేగానికి గురైన నారాయణమూర్తి... ఆక్రమణల తొలగింపుపై అధికార పార్టీనేతలు ప్రతిరోజు వేధిస్తున్నారన్నారు. కార్యాలయంలో పనిచేసుకోనివ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్డీవో మాట్లాడి సెలవుపెట్టాలని అనుకుంటున్నానన్నారు.
 
 గతంలో ఆర్‌ఐగా ఇదే మండలంలో ఏడేళ్లపాటు విధులు నిర్వహించానని, ఇంతటి స్థాయిలో వేధింపులు ఎన్నడూ చూడలేదని కన్నీరుపెట్టారు. అధికారుల పని సక్రమంగా, న్యాయబద్ధంగా చేసుకోనివ్వకపోవడం బాధగా ఉందన్నారు. వేదికపై ఉన్న ఎంపీడీవో మోహన్‌ప్రసాద్, మండలప్రత్యేక ఆహ్వానితుడు ఒమ్మి ఆనందరావు కలుగ జేసుకుని సర్ది చెప్పడంతో శాంతించారు.
 

మరిన్ని వార్తలు