తీవ్ర పెను తుపానుగా ‘వార్దా’

12 Dec, 2016 14:25 IST|Sakshi
తీవ్ర పెను తుపానుగా ‘వార్దా’

విశాఖపట్నం/ అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వార్దా తుపాను రోజు రోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. నిన్నటిదాకా తీవ్ర తుపానుగా కొనసాగిన వార్దా.. ఆదివారం ఉదయానికి తీవ్ర పెను తుపానుగా మారింది. ఇది గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర వైపు దూసుకువస్తోంది. శనివారం రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 520, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 490, చెన్నైకి తూర్పున 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈతీవ్ర పెను తుపాను పశ్చిమ వాయువ్య దిశగా అదే తీవ్రతతో ఆదివారం సాయంత్రం వరకు పయనించనుంది.

అనంతరం క్రమేపీ బలహీనపడుతూ దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనించి చెన్నై–ఒంగోలు మధ్య ఈనెల 12న (సోమవారం) మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో ఆదివారం కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు గాని, వర్షం గాని కురుస్తుందని తెలిపింది. సోమ, మంగళవారాల్లో దక్షిణ, ఉత్తర కోస్తాంధ్రల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు గాను, దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్రలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని చిత్తూరు జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంటుందని వివరించింది.

తుపాను కేంద్రీకృతమైన ప్రాంతంలో ఆదివారం రాత్రి నుంచి గంటకు 130 నుంచి 155 కిలోమీటర్ల వేగంతోను, కోస్తాంధ్ర తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అందువల్ల వచ్చే 48 గంటలపాటు మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు, విశాఖపట్నం, మచిలీపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

అధికారులు అప్రమత్తం...
వార్దా తుపాను తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కోస్తా, రాయలసీమ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించి తుపానును ఎదుర్కొనేందుకు సర్వ సిద్ధంగా, అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు నిత్యావసర సరుకులు అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

వాన రావొచ్చు,కుప్పలు వేస్కోండి!
బంగాళాఖాతంలో ఏర్పడిన వార్దా తుపాను నెల్లూరు వైపు వేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోసి పనలపై ఉన్న వరిని తక్షణమే కుప్పలు వేసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేసింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ కె.ధనుంజయ్‌రెడ్డి ఆదేశాల మేరకు కోస్తాంధ్రలోని వ్యవసాయాధికారులు గత మూడు రోజులుగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కోసిన పంటను సాధ్యమైనంత త్వరగా కుప్పలు వేసుకోవాలని, ఒకవేళ కోతకు వచ్చి ఉంటే ఒకట్రెండు రోజులు వాయిదా వేయాలని, పాయలు తీసి నీళ్లు పోయే మార్గం ఏర్పాటు చేయమని రైతులకు సలహా ఇచ్చారు. వాస్తవానికి వర్షాభావంతో అల్లాడుతున్న రాష్ట్రానికి ఈ తుపానుతోనైనా వర్షం పడుతుందన్న ఆశాభావంతో వ్యవసాయ శాఖ ఉంది. రబీలో ఇప్పటికే దాదాపు 90 శాతం లోటు ఏర్పడింది.

మరిన్ని వార్తలు