తేలని.. ‘మహా’ జలవివాదం

16 Dec, 2019 12:33 IST|Sakshi
ఛత్తీస్‌గడ్‌లో మహానదిపై నిర్మించిన కల్మా బ్యారేజ్‌

మరోసారి క్షేత్రస్థాయి పరిశీలనకు ట్రిబ్యునల్‌ ఆదేశాలు

తదుపరి విచారణ వచ్చే ఏడాదికి వాయిదా

పరస్పరం సహకరించుకునేలా ఉభయ రాష్ట్రాలకు సంకేతాలు!

భువనేశ్వర్‌: మహానది జలాల పంపిణీకి సంబంధించి ఛత్తీస్‌గడ్, ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదం దీర్ఘకాలంగా కొనసాగుతుంది. మహానది జల వివాదాల ట్రిబ్యునల్‌లో ఈకేసు విచారణ కొనసాగుతుంది. తాజాగా జరిగిన విచారణ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, వేర్వేరుగా నివేదికలను దాఖలు చేయాలని ట్రిబ్యునల్‌ ఉభయ రాష్ట్రాలకు ఆదేశించింది. రానున్న జనవరిలో క్షేత్రస్థాయి పరిశీలన ముగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జనవరి 4న ఛత్తీస్‌గడ్‌ ప్రభుత్వ ప్రతినిధులు ఒడిశాను సందర్శిస్తారు. అనంతరం అదే నెల 16న ఒడిశా ప్రతినిధులు ఆ రాష్ట్రాన్ని సందర్శించాలని ట్రిబ్యునల్‌ తేదీలను ఖరారు చేసింది. ఈ రెండు ప్రభుత్వాల నివేదిక దాఖలైన మేరకు వచ్చే ఫిబ్రవరి 1న తదుపరి విచారణ జరుగుతుందని ట్రిబ్యునల్‌ తెలిపింది. గతంలో ఉభయ రాష్ట్రాలు క్షేత్రస్థాయిలో సందర్శించాయి. ఈ ఏడాది అక్టోబరు 29 నుంచి నవంబరు 3 వరకు ఒడిశా ప్రభుత్వ ప్రతినిధులుఛత్తీస్‌గడ్‌లో పర్యటించారు. నవంబరు 2వ వారంలో అక్కడి అధికారుల బృందం స్థానికంగా సందర్శించింది. ఉభయ బృందాలు క్షేత్రస్థాయి నివేదికను ట్రిబ్యునల్‌కు దాఖలు చేశాయి. ఛత్తీస్‌గడ్‌ ప్రభుత్వం ట్రిబ్యునల్‌కు శనివారం నివేదిక దాఖలు చేయగా.. దీనిపై అభ్యంతర పిటిషన్‌ దాఖలు చేసేందుకు ఒడిశాకు 4 వారాల గడువు మంజూరు చేయడం విశేషం.

ఉమ్మడి సర్దుబాటుకు సంకేతాలు
దీర్ఘకాలంగా కొనసాగుతున్న మహానది జలాల పంపిణీ వివాదం క్రమంగా కొలిక్కి వస్తున్నట్లు సంకేతాలు లభిస్తున్నాయి. ఉభయ రాష్ట్రాలు మహానది జలాల పంపిణీ విషయంలో ఉమ్మడి సూత్ర ప్రాతిపదికన రాజీ కుదరకుంటే ట్రిబ్యునల్‌ చొరవ కల్పించుకుని పరిష్కార మార్గదర్శకం జారీ చేస్తుందని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1న జరగనున్న విచారణలో నదీ జలాల పంపిణీ వివాదానికి స్పష్టమైన పరిష్కారం ఖరారు అవుతుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఒడిశా అభ్యర్థన
మహానది ఎగువ భాగంలో ఛత్తీస్‌గడ్‌ ప్రభుత్వం బ్యారేజీలు ఇతరేతర నిర్మాణాలను చేపట్టింది. ఈ పనులను వెంటనే నిలిపి వేయాలని ఒడిశా ప్రభుత్వం అభ్యర్థించింది. వర్షాకాలం తరువాతి వ్యవధిలో రాష్ట్రంలో మహానది లోతట్టు ప్రాంతాలకు 1.74 మిలియన్‌ ఎకరపు అడుగుల నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను అభ్యర్థించింది.

మరిన్ని వార్తలు