జనం బాధ జనాలది.. నాయకులేమో ఇలా..!

19 Apr, 2016 14:11 IST|Sakshi
జనం బాధ జనాలది.. నాయకులేమో ఇలా..!

బాగల్కోట్: ప్రజలు కరువు, నీటి ఎద్దడితో అల్లాడిపోతుంటే.. నాయకులకు, అధికారులకు మాత్రం వారి బాధలు, సమస్యలు పట్టడం లేదు. పర్యటనల పేరుతో నీటిని వృథా చేస్తూ ప్రజలకు మరిన్ని కష్టాలు పెడుతున్నారు.  మహారాష్ట్రలోని లాతూర్లో ప్రజలు తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క అలమటిస్తుంటే.. ఆ ప్రాంతంలో రాష్ట్ర మంత్రి ఎక్‌నాథ్ ఖడ్సే హెలికాప్టర్ దిగేందుకు ఏకంగా 10 వేల లీటర్ల నీటిని వృథా చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రకే చెందిన మరో మంత్రి పంకజా ముండే కరువు ప్రాంత పర్యటనకు వెళ్లి సెల్ఫీ దిగారు. మంత్రుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పర్యటన వివాదాస్పదమైంది.

ఉత్తర కర్ణాటకలోని కరువు ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధరామయ్య వెళ్లారు. సీఎం వెళ్లడానికి ముందు అధికారులు అత్యుత్సాహంతో భారీగా నీటిని వృథా చేశారు. సీఎం పర్యటించే మార్గంలో రోడ్లపై దుమ్ము లేస్తుందనే ఉద్దేశ్యంతో ట్యాంకర్లతో నీటిని తెప్పించి రోడ్లపై చల్లించారు. ఈ సంఘటనపై ప్రతిపక్ష బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ప్రజలు కరువుతో అలమటించిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాష్ట్ర మంత్రులు విహారయాత్రకు యూరప్ వెళ్తున్నారని మండిపడ్డారు. నీటిని వృథా చేసిన విషయంపై సిద్ధరామయ్య స్పందిస్తూ.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరిన్ని వార్తలు