తమిళనాట జల్లికట్టు ప్రకంపనలు

19 Jan, 2017 06:34 IST|Sakshi
చెన్నై మెరీనా తీరంలో ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులు

నిషేధంపై ఉద్యమిస్తున్న తమిళయువత
రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమవుతున్న ఆందోళనలు
జనసంద్రంగా మారిన మెరీనా తీరం

సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘మా ప్రాచీన క్రీడపై నిషేధం విధిస్తారా? ఇది తమిళ సంస్కృతిపై దాడి చేయడమే’ అంటూ చెన్నై సాగరతీరాన తమిళయువత శివాలెత్తింది. జల్లికట్టుపై విధించిన నిషేధం ఎత్తేయాలంటూ వేలాది మంది యువకులు మెరీనా బీచ్‌ వద్ద ఆందోళన చేపట్టారు. కాలేజీలు, వర్సిటీలకు చెందిన వేలాది మంది విద్యార్థులు బుధవారం తరగతులను బహిష్కరించి బీచ్‌కు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ సహా అన్ని పార్టీల, కోలివుడ్‌ మద్దతు తోడవడంతో ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకూ ఆందోళనలు పెరగడంతో తమిళసర్కారు అప్రమత్తమైంది.  జల్లికట్టుపై నిషేధం ఎత్తివేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురావాలని విజ్ఞప్తి చేసేందుకు 51 మంది అన్నాడీఎంకే ఎంపీలతో కలిసి సీఎం పన్నీర్‌ సెల్వం గురువారం ప్రధానిని కలవనున్నారు.

పెటాను నిషేధించాలి..
జల్లికట్టును నిషేధించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన జంతుహక్కుల సంస్థ పెటాపై ఆందోళనకారులు విరుచుకుపడుతున్నారు. తక్షణం ఆసంస్థను మూసివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలంగనల్లూర్, మధురైలోని తమ్ముక్కం గ్రౌండ్స్‌లోనూ యువకులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.  శివగంగ జిల్లాలోని కందిపట్టి గ్రామంలో 100 ఎడ్లతో నిర్వహిస్తున్న మంజు విరాట్టు (ఎద్దులను లొంగదీసుకోవడం) ఉత్సవాన్ని అడ్డుకొని పోలీసులు లాఠీఛార్జి చేయడంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లదాడికి దిగారు.నటుడు విశాల్, కమెడియన్‌ వివేక్, శివకార్తికేయన్‌తో సహా పలువురు   జల్లికట్టుకు మద్దతు ప్రకటించారు. ఈవిషయమై జనవరి 20న ధర్నా చేస్తున్నట్లు దక్షణభారత సినీనటుల సంఘం ప్రకటించింది.  జల్లికట్టు ఉద్యమాన్ని విదేశాల్లోని తమిళులు సైతం బలపరుస్తూ ఆందోళనలు చేపట్టారు. అమెరికా, లండన్, సింగపూర్, కెనడా దేశాల్లో వందలాది మంది తమిళులు బుధవారం ఉదయం ఆందోళనలు నిర్వహించారు.

జోక్యం చేసుకోం: హైకోర్టు
జల్లికట్టును సుప్రీం కోర్టు నిషేధించినందున ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది. మెరినాబీచ్‌లో ఆందోళనలను న్యాయవాది కె. బాలు బుధవారం న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.  మెరీనా బీచ్‌ ఏమీ ధర్నాస్థలం కాదని పేర్కొన్న కోర్టు, సర్వోన్నత న్యాయస్థానం నిషేధించినందున హైకోర్టుగాని, తమిళనాడు ప్రభుత్వంకాని ఏమీ చేయలేవని తేల్చి చెప్పింది.

బీజేపీ జాతీయ కార్యదర్శిపై కేసు: తిరుప్పూరు, మనప్పారై, ఉసిలంపట్టి, శివగంగై జిల్లా సింగంపునరీ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అతిక్రమించి జల్లికట్టు నిర్వహించారు. సింగంపునరీలో జల్లికట్టుకు తన కాడెద్దును పంపిన బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్‌.రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆందోళన విరమించండి: సీఎం
జల్లికట్టుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతు ప్రధాని నరేంద్రమోదీని కలిసి విజ్ఞప్తి చేస్తామని తమిళనాడు సీఎం పన్నీర్‌సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బుధవారం ప్రకటించారు. జల్లికట్టు సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున వెంటనే ఆందోళన విరమించాల్సిందిగా విద్యార్థులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు