అంతా మనోళ్లే!

10 Jan, 2014 23:08 IST|Sakshi
అంతా మనోళ్లే!

ముంబై: ఈసారి ఎన్నికల్లో భారీ ఓట్లతో సత్తా చూపాలనే పట్టుదలతో ఉన్న మహరాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) రాష్ట్రంలోని ఉత్తరాది ఓట్లపై దృష్టి పెట్టింది. ఉత్తరాది వారి వ్యతిరేక పార్టీ అనే ముద్ర నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ‘ఎమ్మెన్నెస్ ఉత్తర భారతీయులకు వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించలేదు. రాజ్‌ఠాక్రే వ్యాఖ్యలను మీడియా వక్రీకరించడం వల్ల అక్కడి వాళ్లు మా పార్టీపై దురభిప్రాయం ఏర్పరుచుకున్నారు. అందుకే ముంబైలోని ఉత్తరాది రాష్ట్రాల ప్రజలతో మాట్లాడి వారిలోని దురాభిప్రాయాలను తొలగించాలని ఆయన నన్ను కోరారు. మహారాష్ట్ర అభివృద్ధే రాజ్ ధ్యేయమన్న విషయాన్ని వారికి నేను స్పష్టం చేస్తాను’ అని ఎమ్మెన్నెస్ అధిపతి సన్నిహితుడు, వాగీశ్ సారస్వత్ అన్నారు.
 
 సినీ కళాకారుల సంక్షేమం కోసం గత నెల ఎమ్మెన్నెస్ నిర్వహించిన కార్యక్రమానికి కూడా అమితాబ్ బచ్చన్ ఆహ్వానించడాన్ని గమనిస్తే ఈ పార్టీ ఉత్తరాది వారికి దగ్గర కావడానికి యత్నిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. దీనిపై వాగీశ్ స్పందిస్తూ ఉత్తరాది వ్యతిరేక ముద్రను తొలగించుకునే ప్రయత్నంగా దీనిని చూడకూడదని, మహారాష్ట్ర తన కర్మభూమి అని అమితాబ్ ప్రకటించడమేగాక, ఆ కార్యక్రమంలో మరాఠీలోనే మాట్లాడారని వివరణ ఇచ్చారు. బచ్చన్‌కు తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు. ‘ఆయన ముంబైలో ఉంటూ ఇతర రాష్ట్రాల ప్రచారకర్తగా వ్యవహరించడాన్నే మేం తప్పుపట్టాం. అయితే ఆయన ముంబైతోపాటు మహారాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారు. మేం ఉత్తరాది వారిని ఎప్పుడూ హింసించలేదు. అయితే మరాఠీల మనోభావాలను దెబ్బతీస్తే మాత్రం ఊరుకోం’ అని తెలిపారు. దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా.. వాళ్లు మహారాష్ట్ర, మరాఠీని గౌరవిస్తే తామూ అభిమానిస్తామన్నారు.
 
 అయితే మరాఠీలను ‘కామధేను’గా భావించి దోపిడీ చేసే విధానాన్ని ఉత్తరాది ప్రజలు వదులుకోవాలని ఎమ్మెన్నెస్ ఉపాధ్యక్షుడు కూడా అయిన వాగీశ్ కోరారు. ఉత్తరాది ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడి మరాఠీల మద్దతు సంపాదించడానికి రాజ్ ప్రయత్నించారని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన దగ్గర అజెండా ఏదీ లేదన్న ఆరోపణలను ఖండించారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే ఉత్తరాది వాసులకు ఎర్రతివాచీ పరుస్తామని, సంఘవ్యతిరేక శక్తులతో పోరాడుతామని ఆయన అన్నారు. తమ పార్టీ రాజకీయ కార్యకలాపాలకు ప్రచారం తేవడానికి గిమ్మిక్కులకు పాల్పడబోమన్నారు. ‘కరువు పీడిత ప్రాంతాల్లో తొలిసారిగా పర్యటించిన రాజకీయ నాయకుడే రాజ్‌ఠాక్రేనే. అక్కడ పశుదాణా శిబిరాలు, రైతుల కోసం సంక్షేమనిధిని ఏర్పాటు చేశారు. రాజ్ ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సామాజిక సంబంధాల సైట్లలో అందుబాటులో ఉండరు. ఆయన సామాజిక సంబంధాల ద్వారానే ప్రజలకు దగ్గరవుతారు. గత లోక్‌సభ, శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఎమ్మెన్నెస్ ప్రాబల్యం ఇప్పుడు బాగా పెరిగింది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు మరిన్ని సీట్లలో పోటీ చేస్తాం. అయితే వేరే పార్టీలతో పొత్తులపై ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీనిపై రాజ్‌ఠాక్రేనే తుది నిర్ణయం తీసుకుంటారు’ అని వాగేశ్ సారస్వత్ వివరించారు. బీజేపీ, శివసేన నేతృత్వంలోని మహాకూటమిలో ఎమ్మెన్నెస్‌ను చేర్చుకునేందుకు ఆ రెండు పార్టీలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడం తెలిసిందే.
 
 రాజ్ వ్యాఖ్యలపై ‘ఆప్’ అసంతృప్తి
 ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) కొత్త పార్టీఅని, అది ఢిల్లీలో విజయం సాధించడం యాదృచ్ఛికం అంటూ రాజ్‌ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై ఆప్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయన అమర్యాదకరంగా మాట్లాడారని, అటువంటి వ్యాఖ్యలపై తాము స్పందించబోమని తెలిపింది. రాజ్ స్థాయికి తాము దిగజారబోమని ఆప్ నాయకుడు మయాంక్ గాంధీ ముంబైలో శుక్రవారం అన్నారు. మహారాష్ట్రలో తమదే అత్యంత ప్రాబల్యమున్న పార్టీ అని, ఆప్‌కు ఇక్కడ అవకాశమే లేదని మూడు రోజుల క్రితం మీడియా సమావేశంలో రాజ్ అన్నారు. శివసేన నాయకుడు మనోహర్ జోషి కుమారుడు ఉన్మేశ్ జోషితో రాజ్‌కు ఉన్న వ్యాపార సంబంధాలపై గాంధీ స్పందిస్తూ రెండు పార్టీల మధ్య పొత్తు ఉందని ఆరోపించారు. ఇదిలా ఉంటే ముంబైకర్లకు చేరువకావడానికి ఆప్ కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 26 వరకు 10 లక్షల సభ్యత్వాల సేకరణ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు మయాంక్ గాంధీ తెలిపారు.
 

మరిన్ని వార్తలు