తుపాకీ లేని ఖాకీ

5 Sep, 2018 10:53 IST|Sakshi

పోలీసులకు ఆయుధాల కొరత  

లోపాలను బయటపెట్టిన కాగ్‌ నివేదిక  

తుప్పుపడుతున్న మందుగుండు  

బొమ్మనహళ్లి: ప్రజా భద్రతను చూసే పోలీసులు లాఠీలతోనే దుండగులను ఎదుర్కోవాల్సి వస్తోంది. హోంశాఖకు ఏటా వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌ను కేటాయిస్తున్నా మౌలికమైన ఆయుధాల కొరత నాలుగో సింహాన్ని నిస్తేజం చేస్తోంది. నేరస్థులు, ఉగ్రవాదుల నుంచి ప్రజల ధన,మాన, ప్రాణాలను రక్షించడానికి ఎన్నో పరీక్షలు నిర్వహించి నెలల పాటు శిక్షణనిచ్చి పోలీసులను నియమించే ప్రభుత్వాలు వారికి ఆయుధాలను ఇవ్వడంలో మాత్రం నిర్లక్ష్య ధోరణిని వదులుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం చిల్లర దొంగల నుంచి ఉగ్రవాదుల వరకు అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉండగా,  వారిని ఎదుర్కొనాల్సిన పోలీసులు మాత్రం దశాబ్దాల కాలం నాటి తుపాకులతోనే నెట్టుకొస్తున్నారు. కానిస్టేబుళ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. రాత్రి వేళల్లో గస్తీలో పాల్గొనే కానిస్టేబుళ్లు కేవలం లాఠీలతో విధులు నిర్వర్తిస్తుండడంతో దొంగలు నిర్భీతిగా దాడులకు తెగబడుతున్నారు. బెంగళూరు నగరంలో కూడా దొంగలు, అసాంఘిక ముఠాలు పోలీసులపై దాడులకు తెగబడ్డ ఘటనలు కోకొల్లలు. ఇంత జరుగుతున్నా పోలీసులకు కొత్త ఆయుధాలు అందించి శాఖలో ఆయుధాల కొరతను నివారించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకర పరిణామం.

కాగ్‌ నివేదికలో చేదు నిజాలు  
రాష్ట్ర పోలీసుశాఖలో ఆయుధాల కొరతపై గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించిందో కాగ్‌ నివేదిక బట్టబయలు చేసింది. సంకీర్ణ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోందంటూ కాగ్‌ స్పష్టం చేసింది. చాలా స్టేషన్లలో కావాల్సినంత మందుగుండు ఉంది, తుపాకులే లేవు, కొన్నిచోట్ల తుపాకులు ఉన్నాయి, అందుకు తగిన మందుగుండు అందుబాటులో లేదు.  
2012లో రాష్ట్రంలోని చాలా పోలీస్‌స్టేషన్‌లలో ఏకే– 47 తదితర ఆయుధాల కొరత మరింత తీవ్రంగా ఉంది.
ప్రతి పోలీస్‌స్టేషన్‌లో తప్పనిసరిగాఉండాల్సిన 0.303 ట్రంకెటేడ్‌ రైఫిల్‌ల కొరత 72 శాతం ఉండగా 2017 మార్చ్‌ నెలఖారు నాటికి కూడా ఆయుధాల కొరత శాతం అంతే ఉన్నట్లు కాగ్‌ నివేదికలో బహిర్గతమైంది.  
ఆయుధాలు ఉన్న 18 పోలీస్‌స్టేషన్‌లలో అందుకు సరిపడా మందుగుండు సామగ్రి లేకపోవడంతో ఆయుధాలన్నింటినీ స్టోర్‌రూమ్‌లలో పడేశారు. పలు పీఎస్‌లలో మందుగుండు కాలవ్యవధి ముగియడంతో బెంగళూరులోని సీఏఆర్,మైసూరు నగరంలోని డీఏఆర్‌ కేంద్రాల్లో అటకెక్కించారు.  ఇంటెలిజెన్స్‌ విభాగ ఏడీజీపీ, కేఎస్‌ఆర్‌పీ, యాదగిరి, తుమకూరు తదితర 18 పోలీసు కేంద్రాల్లో భారీగా నిల్వ చేసిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఏళ్లతరబడి వృథాగా ఉంటోంది. ప్రస్తుతం కొత్తగా పోలీసుశాఖలో చేరిన పోలీసు అధికారులు,సిబ్బందికి ఫైరింగ్‌ శిక్షణ ఇవ్వడానికి కూడా ఆయుధాలు లేనంతగా ఆయుధాల కొరత సమస్య పరిణమించిందని పోలీసు వర్గాల సమాచారం. దీంతో చేతిలో సరైన ఆయుధాలు లేక పోవడంతో రాత్రివేళల్లో విధులు నిర్వర్తించడానికి పోలీసులు వెనుకడుగేస్తున్నారు.  

శిక్షణ లేక చిలుము  
కాగ్‌ నివేదికల ప్రకారం ఎనిమిది జిల్లాల్లోని 21 పోలీస్‌స్టేషన్‌ల సీఐ, ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుళ్లకు 9 ఎంఎం గన్‌లు ఇచ్చారు. అయితే ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుళ్లకు అందించిన గన్‌లను అధికారులు స్టేషన్‌లలోని స్టోర్‌రూమ్‌లలో భద్రపరిచారు. సంవత్సరాల తరబడి స్టోర్‌ రూమ్‌లలో భద్రపరచిన గన్‌లను ఎప్పుడు కూడా వాడకపోవడం, కనీసం అప్పుడప్పుడు శుభ్రం కూడా చేయక తుప్పుపట్టి పనికిరాకుండా పోయాయి.  

ఆయుధాల కొరత లేదు: డీసీఎం పరమేశ్వర్‌  
రాష్ట్రంలోని హోం శాఖలో ఎలాంటి ఆయుధాల కోరత లేదని, సీఏజీ ఇచ్చిన నివేదికను చాలా సీరియస్‌గా తిసుకోవడం జరుగుతుందని హోంశాఖ మంత్రి జి. పరమేశ్వర్‌ అన్నారు. బీజేపీ సీనియర్‌ నాయకుడు, మాజీ డీసీఎం ఆర్‌.అశోక్‌ మాట్లాడుతూ. పోలీసు సిబ్బందికి ఆయుధాల కొరతపై కాగ్‌ నివేదిక మీద చర్చించి ప్రభుత్వానికి సలహాలను ఇస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు