నేరగాళ్లకు ఆయుధాలుగా మారుతున్న మొబైల్ యాప్స్

9 May, 2014 22:26 IST|Sakshi
నేరగాళ్లకు ఆయుధాలుగా మారుతున్న మొబైల్ యాప్స్

అధునాతన సాంకేతిక పరిజ్ఞానం నేరగాళ్లకు వరంగా మారింది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలోని వాట్సప్ , వైర్, వి- చాట్ తదితర యాప్స్‌ను నేరగాళ్లు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. అయితే వాటిపై నిఘాకు పోలీసు శాఖ వద్ద తగిన మౌలిక సదుపాయాలు లేవు. పైగా ఈ యాప్‌ల సర్వర్లు విదేశాల్లో ఉండడం, కేసులకు సంబంధించిన సమాచారం అందే అవకాశం లేకపోవడంతో పోలీసులకు పాలుపోవడం లేదు.
 
 సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్ ఫోన్‌లలో ఉండే పలు అప్లికేషన్లు నేరగాళ్లకు కొత్త ఆయుధాలుగా మారాయి. కాల్‌డేటా రికార్డుల బారి నుంచి తప్పించుకోవడానికి వారు వాట్సప్ , వైర్, వి- చాట్ వంటి యాప్స్‌ను వాడుతున్నారు. వాటిపై నిఘాకు సంబంధించి నగర పోలీసుల వద్ద తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం నేరగాళ్లకు కలిసొచ్చే అంశంగా మారింది.
 క్రైమ్ కేసులలో తాము కంప్యూటర్, లాప్‌టాప్ వంటి పరికరాలను స్వాధీనం చేసుకుని వాటిద్వారా  ఏదైనా ఆధారం లభిస్తుందేమోనని పరిశీలిస్తామని సైబర్‌సెల్‌కు చెందిన పోలీసు ఉన్నతాధికారి చెప్పా రు.

అయితే ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌లే మొబైల్ కంప్యూటర్లుగా మారాయని, నేరగాళ్లు వాటి ద్వారా సమాచారం ఒకరికొకరు చేరవేసుకుంటున్నారని, అవసరం తీరాక వాటిని తొలగిస్తున్నారని అన్నారు. ఈ కారణంగా వాటిని తాము కనుగొనలేకపోతున్నామని ఆయన చెప్పారు. అందుకు కారణం వాట్సప్. వైబర్ అప్లికేషన్స్ సర్వర్లు విదేశాల్లో ఉండడమేనన్నారు.  ఏదైనా కేసులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించడానికి ఈ సర్వర్లు ఆసక్తి చూపవని ఆయన చెప్పారు.

ఉగ్రవాద కార్యకలాపాలు, వైట్ కాలర్ నేరగాళ్లను పట్టుకోవడం కోసం ఇంటర్‌సెప్ట్ టెక్నాలజీని వాడతామని, సైబర్ సెల్‌ను సాంకేతికంగా అభివృద్ధి చేసిక కారణంగా తాము ఇప్పుడు సామాజిక మీడియాపై కూడా కన్నేసి ఉంచగలుగుతున్నామని అన్నారు. అయితే వాట్సప్, వైబర్, వి-చాట్ వంటి యాప్స్ విషయంలో తాము నిస్సహాయులుగా మిగిలిపోతున్నామని ఆయన చెప్పారు ఇంతవరకు తమకు ఒక్క కేసులో కూడా ఈ యాప్స్ సర్వర్ల నుంచి సహకారమే లభించలేదని దక్షిణ ఢిల్లీ ఎస్‌టీఎఫ్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర సింగ్ చెప్పారు.

మరిన్ని వార్తలు