నీటి కష్టాలకు ముగింపెన్నడు?

21 Sep, 2013 01:38 IST|Sakshi
తమ ప్రభుత్వం ఎన్నో ఘన విజయాలు సాధించిందంటూ సీఎం షీలా దీక్షిత్  ఎన్నో ప్రకటనలు చేస్తున్నా.. కనీస అవసరమైన నీటి సరఫరా సమస్యను పరిష్కరించడంలో మాత్రం ఆమె ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. 
 
 న్యూఢిల్లీ: షీలా దీక్షిత్ గత 15 ఏళ్ల పాలన ఎలా ఉన్నా.. నీటి సరఫరా విషయంలో మాత్రం ఆమె ప్రభుత్వం విఫలమైందని చెప్పకతప్పదు. నగర మంతటా నీరు సరఫరా చేసే ఢిల్లీ జలబోర్డు (డీజేబీ)కి ఆమె చైర్‌పర్సన్‌గానూ వ్యవహరిస్తున్నారు కాబట్టి నీటి ఎద్దడిని పరిష్కరించాల్సిన బాధ్యత ఆమె చేతుల్లోనే ఉంటుంది. ఈ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో ఇదీ ఒకటి. యమునానదిని శుద్ధీకరించడంలోనూ ఆమె చెప్పుకోగదగ్గ విజయాలను సాధించలేకపోయారు. ఢిల్లీకి ప్రతినిత్యం 835 ఎంజీడీల (మిలియన్ గ్యాలన్స్ పర్ డే) నీరు సరఫరా అవుతోంది. మరో 300 ఎంజీడీల నీరు సరఫరా చేయగలిగితేనే ఎద్దడి నివారించడం సాధ్యపడుతుంది. 
 
 ఒప్పందం ప్రకారం మునాక్ కాలువ నుంచి హర్యానా ప్రభుత్వం 80 ఎంజీడీల నీటిని విడుదల చేయించడంలోనూ షీలా ప్రభుత్వం విఫలమయిం ది. దీంతో నీటిశుద్ధి కోసం నిర్మించిన మూడు ప్లాంట్లు వృథాగా పడున్నాయి. ప్రస్తుతం మెజారిటీ దిల్లీవాలాలకు ప్రతిరోజూ నీళ్లు అందడం లేదు. కొన్నిచోట్ల రోజుకోసారి సరఫరా చేస్తున్నారు. నీటి సరఫరా వ్యవస్థను కూడా ప్రభుత్వం ప్రైవేటీకరించడం వివాదాస్పదంగా మారింది. పైప్‌లైన్లు పగలడం, వృథా కారణంగా ఎద్దడి పెరగడంతో ప్రైవే టు కంపెనీలకు సరఫరా బాధ్యత అప్పగించారు. అయితే ఉమ్మడి ప్రైవేటు సంస్థల అధీనంలోని ప్రాంతాల్లో 24 గంటలపాటూ నీటి సరఫరా ఉంటోందని డీజేబీ చెబుతోంది. ‘ఢిల్లీ నీటి సరఫరా వ్యవస్థ చాలా పాతది. నగరం వేగంగా విస్తరిస్తోం ది. నీళ్ల కోసం రాజధాని ప్రభుత్వం పక్క రాష్ట్రాలపై ఆధారపడుతున్నందున డిమాండ్‌ను అందుకోవడం అసాధ్యం.
 
 కాబట్టి సరఫరా నష్టాలు, వృథా తగ్గించాలంటే ప్రైవేటు కంపెనీల సాయం తీసుకోవడం తప్పనిసరి’ అని డీజేబీ అధికారి ఒకరు అన్నారు.  తప్పుడు బిల్లుల సమస్య పరిష్కారం కోసం ఇటీవల ఆన్‌లైన విధానాన్ని ప్రవేశపెట్టినా పరిస్థితి మారలేదు. ఎప్పటిలాగే నీటి బిల్లులు భారీగా వస్తున్నాయని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. నీళ్ల వంటి కనీస సదుపాయాల కల్పన బాధ్యతను ప్రైవేటుసంస్థలకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం తన అసమర్థతను బయటపెట్టుకుందని విమర్శకులు అంటున్నారు. నీళ్ల ట్యాంకర్ మాఫి యా కూడా యథావిధిగా కొనసాగుతూనే ఉంది. నీటి లభ్యతను పెంచడానికి డీజేబీ ప్రతినిత్యం 45 ఎంజీడీల నీటిని ప్లాంట్లలో శుద్ధిచేస్తోంది. యమునానది నీళ్లను, మురికినీళ్లతో కలిసి శుద్ధి చేసి తాగునీటికి వినియోగించుకునేలా చేసే ప్లాంటు నిర్మాణం కోసం సింగపూర్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.  
 
 యమున బాగుపడేదెప్పుడో!
 యమునా నదిలో కాలుష్యస్థాయిని తగ్గించడానికి డీజేబీ భారీ ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. కలుషిత జలాలకు అడ్డుకట్టవేయడానికి ‘ఇంటర్‌సెప్టర్ సీవేజ్ సిస్టమ్’ను అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానంలో మురుగుకాల్వ నీటిని ప్లాంట్లో శుద్ధి చేసిన తరువాతే నదిలోకి పంపిస్తారు. దీని పనితీరుపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పథకాల కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా ఫలితా లు కనిపించడం లేదని పర్యావరణ నిపుణులు అంటున్నారు.  
 
 ‘నదిలోకి మురుగునీరు చేరకుండా అడ్డుకోవాలనే కోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో నీరు నదిలోనే కలుస్తోంది. శుద్ధి చేసే ప్లాంట్లకు తగిన పరిమాణంలో నీరు సరఫరా కావడం లేదు’ అని తపస్ ఎన్జీవో డెరైక్టర్ వినోద్ జైన్ అన్నారు. ఇక భూగర్భ జలాల పరిరక్షణ బిల్లును కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే భూగర్భ జలాల వినియోగానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే భూగర్భజలాలు అడుగంటకుండా నిరోధించడానికి ప్రస్తుతం సామాజిక బావుల నిర్మాణానికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. 
 
>
మరిన్ని వార్తలు