బోరే సమాధి!

10 Aug, 2014 02:55 IST|Sakshi
బోరే సమాధి!
  • తండ్రి విజ్ఞప్తితో సహాయక చర్యలు నిలిపివేత
  •  తిమ్మన్న కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం
  •  సూళకేరిలో విషాదం
  •  బాలుడికి అక్కడే అంత్యక్రియలు
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బాగలకోటె జిల్లా సూళకేరిలో బోరు బావిలో పడిపోయిన ఆరేళ్ల తిమ్మన్నను వెలికి తీయడానికి వారం రోజులుగా చేపట్టిన పనులను శనివారం పూర్తిగా నిలిపివేశారు. బోరులోనే మరణించిన తిమ్మన్నకు అక్కడే అంత్యక్రియలు కూడా జరపాలని నిర్ణయించారు. గుంత తవ్వకం పనులను ఆపి వేయాలని, తన పొలాన్ని యథా పూర్వ స్థితికి తెచ్చి అప్పగించాలని తిమ్మన్న తండ్రి హనుమంతప్ప చేసిన విజ్ఞప్తిపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎస్‌ఆర్. పాటిల్ అధ్యక్షతన బాగలకోటెలో అధికారుల సమావేశాన్ని నిర్వహించారు.

    అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ సమాంతర గుంత తవ్వకం పనులను వెంటనే నిలిపి వేయడంతో పాటు దానిని పూడ్చి వేసే పనులు సత్వరమే ప్రారంభమవుతాయని తెలిపారు. వంద లోడ్లు పట్టినా, వేరే మట్టితో గుంతను పూడ్చి వేయిస్తామని వెల్లడించారు. తిమ్మన్న కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల నష్ట పరిహారాన్ని చెల్లిస్తుందని తెలిపారు. ఈ మొత్తాన్ని ఎస్‌బీఐలో అతని తల్లిదండ్రుల పేరిట ప్రారంభించే ఉమ్మడి ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు.

    అంతకు ముందు గుంత తవ్వకం పనులను నిలిపివేయాలా, వద్దా అనే విషయమై తేల్చడానికి పొలంలోని మట్టి స్వభావాన్ని పరీక్షించడానికి వచ్చిన ప్రొఫెసర్ శ్రీనివాసమూర్తి, పనులు నిలిపివేస్తేనే మంచిదనే సలహా ఇచ్చారు. అప్పటికే స్థానికులు కూడా తవ్వకం పనులను నిలిపి వేయాలని సంఘటనా స్థలం వద్ద ధర్నా నిర్వహించారు. దీని వల్ల తమ పొలాలు కూడా దెబ్బ తింటున్నాయని ఆరోపించారు. తిమ్మన్న తండ్రి విజ్ఞప్తి, స్థానికుల ఆందోళన, తవ్వకాన్ని కొనసాగిస్తే మున్ముందు ప్రమాదమనే హెచ్చరికల నేపథ్యంలో వారం రోజులుగా సాగుతున్న ఈ ఉత్కంఠ భరిత ఘట్టానికి తెర పడింది. 

>
మరిన్ని వార్తలు