-

ఆ జాలర్ల జాడేది?

21 Dec, 2016 02:18 IST|Sakshi

► కుటుంబాల్లో ఆందోళన
►  కాశిమేడులో ఉత్కంఠ
► ఆచూకీ కోసం అన్వేషణ
► వర్దా తాండవంలో గల్లంతయ్యారా...

పొట్ట కూటి కోసం సముద్రంలోకి వెళ్లిన పది మంది జాలర్ల ఆచూకీ లభించ లేదు. అసలు వీళ్లు ఎక్కడున్నారో అంతు చిక్కడం లేదు. వర్దా తుపాన్ కు ముందే సముద్రంలోకి వెళ్లిన తమ వాళ్లు ఎక్కడో ఓ చోట సురక్షితంగా ఉంటారని భావించిన కుటుంబాల్లో రోజులు గడిచే కొద్ది ఆందోళన అధికమవుతోంది. తమ వాళ్లను వర్దా మింగేసిందా..? అన్న ఆవేదనతోకన్నీటి పర్యంతం అవుతున్నారు. మంగళవారం
మత్స్య శాఖ మంత్రి డి జయకుమార్‌ దృష్టికి సమాచారం రావడంతో ఆచూకీ కోసం అన్వేషణ మొదలైంది.

సాక్షి, చెన్నై: వర్దా తుపాన్ ఈనెల ఐదో తేదీన చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. 120 నుంచి 130 కీ.మీ వేగంతో వీచిన గాలుల దాటికి పెను నష్టం తప్పలేదు. రూ. 22 వేల కోట్ల మేరకు నష్టాన్ని చవి చూశామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రకటించడమే కాదు, ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. నష్టం అపారమే అయినా, పెను ప్రాణ నష్టాన్ని ముందస్తు చర్యలతో అడుకున్నారని చెప్పవచ్చు. వర్దా ధాటికి 24 మంది మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పది మంది జాలర్ల ఆచూకీ కానరాకపోవడంతో ఆందోళన నెలకొంది.

పది మంది ఎక్కడ: వర్దా తుపాన్ ప్రభావం తొ లుత ఆంధ్రా వైపుగా అత్యధికంగా ఉంటుందన్న సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. దీంతో ఈనెల రెండో తేదీ అర్ధరాత్రి , మూడో తేదీ ఉదయం కాశిమేడు నుంచి జాలర్లు కడలిలోకి వెళ్లారు.  మూడో తేదీ రాత్రికి వర్దా చెన్నై వైపుగా ముంచుకొస్తున్న సమాచారంతో సాగరంలోకి వెళ్లిన జాలర్ల తిరుగు పయనం కావాలన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. ఓ వైపు కోస్ట్‌ గార్డ్, నౌకాదళం ద్వారా, మరో వైపు రేడియోల ద్వారా సమాచారాలు సముద్రంలోని జాలర్లకు పంపించారు. జాలర్లందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరినట్టేనని భావించారు. వర్దా ధాటి నుంచి తమ పడవల్ని రక్షించుకునేందుకు జాలర్లు తీవ్రంగానే శ్రమించారు.ఈ సమయంలో పది మంది జాలర్ల ఆచూకీ కన్పించడం లేదన్న సమాచారంతో, వారు ఎక్కడున్నారో, ఏమయ్యారో అన్న ఉత్కంఠ బయలు దేరింది.

కన్నీటి పర్యంతం: కాశిమేడుకు చెందిన పది కుటుంబాలు, వారి ఆప్తులు, బంధువులు కన్నీటి పర్యంతంతో అక్కడి మత్స్యశాఖ కార్యాలయం వద్దకు పరుగులు తీశారు.  ఈనెల రెండో తేదీ అర్ధరాత్రి వేటకు వెళ్లిన తమ వాళ్లు, ఆంధ్రా వైపుగా లేదా, నాగపట్నం , పాండిచ్చేరిల వైపుగా వేటకు వెళ్లి ఉంటారని భావించామని పేర్కొన్నారు. తుపాన్ తీరం దాటి వారం రోజులు అవుతున్నా, తమ వాళ్ల నుంచి ఇంత వరకు  ఎలాంటి ఫోన్ కూడా రాలేదని ఆ కుటుంబాలు కన్నీటి పర్యంతంతో విలపిస్తున్నాయి. వర్దా ధాటికి వీరు గల్లంతయ్యారా..? లేదా, ఎక్కడైనా చిక్కుకుని ఉన్నారా..? అన్న ఆందోళనలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వాళ్ల ఆచూకీ  కనిపెట్టాలని అధికారుల్ని వేడుకున్నారు. అక్కడి నుంచి నే రుగా మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ను కలిసి విన్నవించుకున్నారు. దీంతో ఆ పది మంది ఆచూకీ కోసం అన్వేషన్ మొదలెట్టారు.  సముద్రంలోకి వెళ్లి ఆచూకీ గల్లంతైన వారిలో మాధవన్, వెంకటరామన్, అంతోని రాజ్, రవి, రాజేం ద్రన్, శివ, నిర్మల్‌ రాజ్, వినోద్, మల్లికార్జునలతో పాటు మరో ఇద్దరు ఉన్నారు.  

రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్‌: శివార్లలో జన జీవనం మెరుగు పడుతోంది.  క్రమంగా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనులు ఆగమేఘాలపై సాగుతున్నాయి.. కొన్ని చోట్ల కాసేపు విద్యుత్‌ సరఫరా అందిస్తుండగా, మరి కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో విద్యుత్‌ అందుతున్నది. మరికొన్ని చోట్ల రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించేందుకు తగ్గ చర్యలతో అధికారులు ముందుకు సాగుతున్నారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు గాను సాంకేతిక పరంగా తాము పూర్తి సహకారం అందిస్తున్నామని, రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్‌ ప్రజలకు అందుతుందని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఢిల్లీలో మంగళవారం ప్రకటించారు. ఇక, రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి తంగమణి అధికారులతో కలిసి పనుల్ని పరిశీలిస్తూ వేగవంతం చేయించే పనిలో నిమగ్నం అయ్యారు. కాగా, ఈ వర్దా ధాటికి తాంబరం సమీపంలోని టీబీ ఆసుపత్రికి భారీ నష్టం జరిగింది. రూ.ఐదు కోట్ల మేరకు ఈ నష్టం ఉండడం గమనార్హం.

వదంతులు నమ్మోద్దు: తుపాన్ వదంతుల్ని నమ్మవద్దు అని ప్రజలకు వాతావరణ శాఖ సూచించిం ది. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో నె లకొన్న అల్పపీడనం ప్రభావంతో సముద్ర తీరా ల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి స్టెల్లా తెలిపారు. ఆ ద్రోణి బలపడే విషయంగా పూర్తి సమాచారం లేదని, తుపాన్  ముంచుకొస్తుందన్న ఆందోళన వద్దు అని సూచించారు.

మరిన్ని వార్తలు