సోనియా కసరత్తు!

2 Jul, 2016 12:22 IST|Sakshi
  • టెన్ జన్‌పథ్‌కు నేతలు
  • అధ్యక్ష పదవికి నువ్వా..నేనా
  • ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయం
  •  
     సాక్షి, చెన్నై : తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ దృష్టి పెట్టారు. ఇందుకు తగ్గ కసరత్తులు చేపట్టి ఈనెల ఆరో తేదీలోపు ముగించాలని  నిర్ణయించినట్లు సమాచారం. టెన్ జన్‌పథ్ నుంచి పిలుపు వస్తుండడంతో క్యూకట్టే పనిలో టీఎన్‌సీసీ నేతలు నిమగ్నమయ్యారు.

    రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష ఎంపిక ఢిల్లీకి చేరడంతో ఆ పదవిని ఆశిస్తున్న వాళ్లంత దేశ రాజధానికి పయనమయ్యారు. టీఎన్‌సీసీ పదవికి ఈవీకేఎస్ ఇలంగోవన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాతో ఖాళీ ఏర్పడ్డ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌లో గట్టి పోటీ ఏర్పడింది. ఏఐసీసీ కార్యదర్శి తిరునావుక్కరసర్, ఎమ్మెల్యే, వ్యాపార వేత్త వసంతకుమార్, కేంద్ర మాజీ మంత్రి సుదర్శన నాచ్చియప్పన్, మాజీ ఎమ్మెల్యే పీటర్ అల్ఫోన్స్‌లతో పాటు పలువురు రేసులో నిలబడ్డారు. అయితే చివరకు పై నలుగురి మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉన్నది. ఈవీకేఎస్ మద్దతు దారులు మాత్రం పీటర్ అల్ఫోన్స్‌కు పగ్గాలు అప్పగించాలన్న నినాదంతో గురువారం ఢిల్లీకి చేరారు.

    తొలుత రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ముకుల్ వాస్నిక్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం టెన్ జన్‌పథ్‌కు ఈవీకేఎస్ మద్దతుదారుడు శివరామన్ నేతృత్వంలో ఇరవై జిల్లాల అధ్యక్షులు చేరుకున్నారు. అక్కడ అధినేత్రి సోనియాగాంధీతో ఈవీకేఎస్ మద్దతు దారులు భేటీ అయ్యారు. ఈవీకేఎస్ నేతృత్వంలో పార్టీ బలోపేతానికి తీసుకున్న చర్యలను వివరించారు.

    సమష్టి నాయకత్వంతో ముందుకు సాగేందుకు ఆయన ప్రయత్నించిరు. కానీ గ్రూపు నేతలు సాగించిన రాజకీయాలను అధినేత్రి సోనియాకు వారు వివరించి వచ్చారు. వీరి భేటీ అనంతరం పీటర్ అల్ఫోన్స్ సోనియాగాంధీతో గంటకు పైగా సమావేశం కావడం గమనార్హం.

    సాయంత్రం మరో మారు పీటర్ భేటీ కావడంతో అధ్యక్ష పదవి ఆయనకు దక్కుతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఇక, తమకు టెన్ జన్‌పథ్ నుంచి పిలుపు వస్తుందన్న ఎదురు చూపుల్లో తిరునావుక్కరసర్, వసంతకుమార్, సుదర్శన నాచ్చియప్పన్ ఉన్నారు. వసంతకుమార్, సుదర్శన నాచ్చియప్పన్ చడీ చప్పుడు కాకుండా బుధవారం సోనియా గాంధీని కలిసినట్టు సమాచారం. అయితే, మరో మారు తమకు పిలుపు వస్తుందన్న ఆశతో వారు ఢిల్లీలోనే ఉన్నారు.

    ఇక, మాజీ ఎమ్మెల్యే గోపినాథ్‌ను సైతం సోనియా గాంధి పిలిపించి మాట్లాడినట్టు తెలిసింది. అధ్యక్ష ఎంపిక మీద కసరత్తుల్లో పడ్డ అధినేత్రి, గ్రూపుల నేతలందర్నీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేరీతిలో ఆ పదవికి అర్హుడ్ని ఎంపిక చేసేందుకు నిర్ణయించినట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

    ఈనెల ఆరో తేదీలోపు రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడ్ని నియమించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే, సోనియా దృష్టి పీటర్ వైపుగా ఉండగా, రాహుల్ మాత్రం తిరునావుక్కరసర్‌కు పగ్గాలు అప్పగించే దృష్టితో ఉన్నారని , వీరిలో ఎవర్నీ ఆ పదవి వరిస్తుందో ఆరో తేదీ వరకు వేచి చూడాల్సిందేనని పేర్కొంటున్నారు.

>
మరిన్ని వార్తలు