కొత్త బాస్ ఎవరు?

2 Oct, 2013 00:24 IST|Sakshi

సాక్షి, ముంబై: వివిధ రాష్ట్ర ప్రభుత్వశాఖల డెరైక్టర్లు పదవీ విరమణ  చేయడంతో ప్రస్తుత నగర పోలీసు కమిషనర్‌గా కొనసాగుతున్న సత్యపాల్ సింగ్‌కుఏదో ఒక ఉన్నత పదవిని అప్పగించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సింగ్ సీటును దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే అనేక మంది ఉన్నతాధికారులు పైరవీలు చేయడం ప్రారంభించారు. అవినీతి నిరోధకశాఖ డెరైక్టర్ రాజ్‌ప్రేమ్ ఖిల్నానీ సోమవారం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలనే విషయాన్ని ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. దీంతో తాత్కాలికంగా ఈ పదవి బాధ్యతలను పోలీసుశాఖ గృహనిర్మాణ మండలి డెరైక్టర్ ప్రదీప్ దీక్షిత్‌కు అదనంగా అప్పగించారు.
 
 గత మార్చిలో హోంశాఖ ఉన్నతాధికారి శ్రీదేవి గోయల్ పదవీ విరమణ చేశారు. ఆ స్థానం ఇప్పటికీ ఖాళీగానే ఉంది. అదేవిధంగా ఖిల్నానీ స్థానంలో ఇంతవరకు ఎవరినీ నియమించకపోవడంపై పోలీసుశాఖలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సాధారణ ఇన్‌స్పెక్టర్లతోపాటు అసిస్టెంట్ పోలీసు కమిషనర్లలో కొందరిని ఇటీవల  బదిలీ చేశారు. అయితే సూపరింటెండెంట్లు, ఆపైస్థాయి అధికారులను ఇంతవరకు బదిలీ చేయలేదు. పదోన్నతులు కూడా కల్పించలేదు. వాస్తవానికి మార్చి లేదా ఏప్రిల్ ఆఖరులో పోలీసు అధికారులను బదిలీ చేయాలనే నియమాలు ఉన్నాయి. ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు సీనియర్ అధికారులను బదిలీ చేయలేదు. ముఖ్యంగా సూపరింటెండెంట్, డిప్యూటీ కమిషనర్‌స్థాయి అధికారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గోయల్, ఖిల్నానీ పదవీ విరమణ పొందడంతో పోలీసుశాఖలో డెరైక్టర్‌స్థాయి పదవులు రెండు ఖాళీ అయ్యాయి. ఈ స్థానాల్లో సత్యపాల్‌సింగ్ లేదా జావెద్ అహ్మద్ ఇద్దరిలో ఒకరిని నియమించే అవకాశాలున్నాయి. వీరిలో సింగ్‌కే ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి.
 
 ఫలితంగా ఖాళీ అయ్యే నగర పోలీసు కమిషనర్ పదవిని దక్కించుకునేందుకు వివిధ శాఖల ఉన్నతాధికారులు పోటీ పడుతున్నారు. వీరిలో విజయ్ కాంబ్లే, రాకేశ్ మారియా వంటి సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు.  హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ మాట్లాడుతూ ముంబై పోలీసు కమిషనర్ పదవికి అనేక మంది అధికారులు పోటీపడుతున్న విషయం వాస్తవమేనని అన్నారు. జావెద్ అహ్మద్, కె.పి.రఘువంశి, విజయ్ కాంబ్లే, పి.కె.జైన్, మాథుర్, రాకేశ్ మారియా, మీరా బోర్వన్కర్ తదితర అధికారుల పేర్లు పరిశీలనలతో ఉన్నాయని వెల్లడించారు. కమిషనర్‌గా ఎవరిని నియమించాలనే విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, త్వరలో ఈ విషయమై ప్రకటన చేస్తామని మంత్రి పాటిల్ చెప్పారు.

మరిన్ని వార్తలు