ప్రతిభ ఎవరి సొత్తూ కాదు

11 Jan, 2015 01:34 IST|Sakshi
ప్రతిభ ఎవరి సొత్తూ కాదు

 ప్రతిభ ఎవరి సొంతమూ కాదు. వెలిగిపోతున్న వారే కాదు వెలుగు చూడని వారిలోనూ చాలామంది ప్రతిభావంతులు ఉంటారు. కాస్త ఆలస్యం అయినా అలాంటి వారి కోసం అన్వేషిస్తే తప్పక ఫలితం ఉంటుంది. యువ సంగీత దర్శకుడు, దర్శకుడిగా తొలిసారిగా మెగాఫోన్ పట్టిన జేమ్స్ వసంతన్ అలాంటి సుదీర్ఘ అన్వేషణే జరిపారు. పలువురు ప్రతిభావంతులైన యువతతో వానవిళ్‌వాళ్కై చిత్రం ద్వారా సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. జేమ్స్ వసంతన్ కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న చిత్రం వానవిళ్ వాళ్కై. ఒసేనా ఏజేఆర్ ఆర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై ఎ.జోసెబ్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రస్నా అదిరాజ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 
 నూతన తారాగణం
 జేమ్స్ వసంతన్ ఈ చిత్రం ద్వారా నూతన తారాగణాన్ని పరిచయం చేస్తున్నారు. వీరంతా లోకల్ టాలెంట్ యూత్ కావడం గమనార్హం. కొందరు కళాశాల చదువు పూర్తి చేసిన వారు, మరికొందరు చదువుకుంటున్న వారు కావడం విశేషం. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే వీరంతా నటీనటులే కాదు, సంగీత కళాకారులు, గాయనీ గాయకులు. చిత్రంలో నటిస్తున్న 11 మంది ప్రముఖ పాత్రధారులు తమ పాటలకు తామే సంగీత వాయిద్యాలు వాయించారు. కళాశాల నేపథ్యంలో సాగే     ఈ చిత్ర కథలో పాటలన్నీ పాప్, రాక్ స్టైల్‌లో ఉంటాయి. చిత్రంలో 17 పాటలు ఉండడం మరో విశేషం. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం     నగరంలోని సత్యం సినీ కాంప్లెక్స్‌లో జరిగింది.         దర్శకుడు వసంతన్ చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఈ చిత్రంలోని కొన్ని పాటలను విద్యార్థులు పాడి అలరించారు.
 

మరిన్ని వార్తలు