కర్ణాటకలో ‘శ్రీమంతుడు’

7 Mar, 2016 15:22 IST|Sakshi
కర్ణాటకలో ‘శ్రీమంతుడు’

బెంగళూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి నియోజకవర్గంలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చినా ఎవరు పెద్దగా ముందుకు రావడం లేదు. మహేశ్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమా స్ఫూర్తితో కొంతమంది సినీ కళాకారులు కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు.  అదే స్ఫూర్తితో ఆర్‌వీ ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న రాహుల్ ప్రసాద్ అనే 24 ఏళ్ల యువకుడు 140 ఇళ్లున్న కర్ణాటకలోని భద్రపుర అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

 

రాష్ట్ర రాజధాని బెంగళూరుకు యాభై కిలోమీటర్లు, మైసూర్ రోడ్డుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామాన్ని రాజకీయ నాయకులెవరూ పట్టించుకోవడం లేదు. ఓపెన్ డ్రౌనేజ్ వల్ల కాల్వలు మురికి కంపుకొడుతుండడంతోపాటు దోమల బ్రీడింగ్ కేంద్రాలుగా మారిపోయాయి. దానికి తోడు మెజారిటీ ఇళ్లలో మరుగుదొడ్లు లేవు. ప్రజలు బహిర్భూమికి వెళ్లడమే అలవాటు. ఫలితంగా గ్రామ ప్రజలు, ముఖ్యంగా పిల్లలు అంటు రోగాల పాలవుతున్నారు. గ్రామంలో వైద్య సౌకర్యం కూడా లేదు. రోగమొచ్చినా, నొప్పొచ్చిన 8 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రికి  వెళ్లాల్సి వస్తోంది. గ్రామానికి విద్యుత్ సౌకర్యం కూడా సరిగ్గా లేదు.

 ఇలాంటి పరిస్థితుల్లో నాలుగేళ్ల క్రితం రాహుల్ ప్రసాద్ ఈ ఊరిలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఓ వైద్య శిబిరంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఇలా అప్పుడప్పుడు వెళుతూ వస్తున్నారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని, మందులను ఉచితంగా అందజేస్తూ వచ్చారు. అయినా గ్రామ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక ఇలాగైతే లాభం లేదనుకున్న రాహుల్ గ్రామం మొత్తాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించారు. అందుకు వెంటనే మంచనాయకనహల్లి పంచాయతీ డెవలప్‌మెంట్ అనుమతి తీసుకున్నారు. జువనైల్ కేర్ చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు.

సహకార పద్ధతిలో గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఊరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించారు. ప్రజల సహకారంతో మురికినీటి వ్యవస్థను మెరగుపర్చారు. పిల్లల చదువుకోసం గ్రామంలోనే ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసి వారికి చదువు చెప్పడం ప్రారంభించారు. ట్రస్టుకు వచ్చే విరాళాలను గ్రామాభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు. పీజో ఎలక్ట్రానిక్ జనరేటర్ల ద్వారా గ్రామంలో విద్యుత్ వ్యవస్థను మెరగుపర్చేందుకు ప్రస్తుతం కృషి చేస్తున్నారు.  రాహుల్ స్వచ్ఛంద సేవను గుర్తించిన ఐక్యరాజ్య సమితి ‘కర్మవీర్ చక్ర’ అవార్డుతో సత్కరించింది. ఐక్యరాజ్య సమితి సహకారంతో భారత ఎన్జీవోల సమాఖ్య ఏర్పాటు చేసిన రెక్స్ గ్లోబల్ ఫెల్లోషిప్ కూడా రాహుల్‌కు లభించింది.

మరిన్ని వార్తలు