చంద్రబాబుకు ఎందుకింత వైరాగ్యం?

13 Oct, 2016 14:21 IST|Sakshi
చంద్రబాబుకు ఎందుకింత వైరాగ్యం?

చంద్రబాబు పరిపాలనను పక్కన పెట్టి దోమలపై దండయాత్రలు, ఈగలపై యుద్ధాలు చేస్తున్నారని డోన్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని వైఎస్ఆర్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవికే చంద్రబాబు చెడ్డపేరు తెస్తున్నారని మండిపడ్డారు. ఈ మధ్య ఆయన మాటల్లో వైరాగ్యం కూడా కనిపిస్తోందని.. ఓటుకు కోట్ల కేసులో రేవంత్ రెడ్డి వాడినవన్నీ 500 నోట్లే కావడం వల్లే ఇంత వైరాగ్యం వచ్చిందా అని అడిగారు. 500, 1000 నోట్ల రద్దు విషయం సరేగానీ లంచగొండితనం, అవినీతి గురించి కూడా మాట్లాడాలన్నారు. ఇక నల్లధనం అంశంపై ఆయన ప్రధానికి ఉత్తరం రాయాలనుకుంటున్నారు గానీ.. తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే లేఖ రాసేశారని చెప్పారు.

నల్లధనం వెల్లడి పథకం గురించిన వివరాలను బయటకు వెల్లడించబోమని సీబీడీటీ స్పష్టంగా చెప్పిందని.. కానీ చంద్రబాబు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో 13వేల కోట్లు బయటపడ్డాయని, అందులో ఒక వ్యక్తే 10 వేల కోట్లు బయటపెట్టినట్లు చెప్పారన్నారు. ఒకవైపు సీబీడీటీ మాత్రం ఆ పేర్లు గానీ, ప్రాంతాలు గానీ, రాష్ట్రాలు గానీ బయటపెట్టబోమని చెబుతుంటే మరోవైపు చంద్రబాబుకు ఆ వివరాలు ఎలా తెలిశాయని బుగ్గన ప్రశ్నించారు. ఒకవేళ ఎవరైనా ఏవైనా పేర్లు బయటకు చెబితే వాటిని నమ్మొద్దని.. అవి మోసపూరితమని సీబీడీటీ చెప్పిందని, కేంద్రం ఇంత కచ్చితంగా చెబుతుంటే చంద్రబాబు అంత స్పష్టంగా ఎలా చెబుతున్నారో చెప్పాలని కోరారు. డిక్లేర్ చేసినవారికి తప్ప మరెవ్వరికీ ఆ వివరాలు తెలిసే అవకాశం లేదని కేంద్రం చెబుతోందని, ముఖ్యమంత్రికి ఆ వివరాలు ఎలా తెలిశాయని అడిగారు.

దేశంలో ఎక్కడా లేనంత అవినీతి ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని ఎన్‌సీఎఈఇర్ సర్వేలో తేలిన విషయం గుర్తుందా లేదా అని రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే ఏపీలో 1.50 లక్షల కోట్ల అవినీతికి సంబంధించిన ఒక పుస్తకం కూడా వచ్చిందని.. ఇసుక నుంచి పట్టిసీమ, రాజధాని, భూముల సేకరణ వరకు అన్ని అంశాలూ ఈ పుస్తకంలో ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చెప్పిన పదివేల కోట్లు వెల్లడించిన వ్యక్తి ఎవరో బయటపెట్టాలని ప్రధానమంత్రిని కోరుతున్నామన్నారు. ఈయన చెప్పే విషయాలు చూస్తే.. భాస్కరాచార్యులు వచ్చి సున్నాకు విలువ లేదని, శుశ్రుతుడు వైద్యానికి విలువ లేదని చెప్పినట్లు ఉందని ఎద్దేవా చేశారు.

అమరావతి శంకుస్థాపనకు వందల కోట్లు ఖర్చుపెట్టారని, పట్టిసీమ అని పంపులు బిగించి.. దానికి 1600 కోట్లు అన్నారని, గోదావరి, కృష్ణా పుష్కరాల పేరుతో 3000 కోట్లు ఖర్చుపెట్టామంటున్నారని, పారిశ్రామిక సబ్సిడీలకు 2200 కోట్లు ఇచ్చామంటున్నారని.. ఆ డబ్బంతా ఏమైందని బుగ్గన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తానే హైదరాబాద్ కట్టానంటున్నారు.. అలాగైతే 400 ఏళ్ల క్రితం కట్టిన కులీ కుతుబ్ షా ఏమైపోవాలని అడిగారు. ఐటీని తీసుకొచ్చింది తానేనంటారని.. కానీ ఈయనకు ఐటీ అంటే ఏంటో తెలిసేసరికే విదేశాల్లో అది ఎప్పుడో ఉందని గుర్తుచేశారు. సత్య నాదెళ్లకు, పీవీ సింధుకు తానే స్ఫూర్తి అంటారని, ప్రజలు ఇదంతా చూస్తుంటే చివరకు ఆయన క్రెడిబులిటీ దెబ్బతినడంతో పాటు శాశ్వత నష్టం జరుగుతుందని తెలిపారు.

అలాగే ఈమధ్య మరోసారి మాట్లాడుతూ.. ఎక్కడ పుట్టాలో ఎంపిక చేసుకోలేరు గానీ, ఒకవేళ అవకాశం అంటూ ఉంటే తాను, వెంకయ్యనాయుడు అమెరికాలో పుట్టాలనుకునేవారం అని అన్నారని గుర్తుచేశారు. ఏదేశమేగినా.. అన్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఎక్కడకు వెళ్లినా తెలుగు గడ్డమీదే పుట్టాలని అంతా కోరుకుంటారని, మన తల్లి కడుపునే జన్మజన్మలకు పుట్టాలని అంతా కోరుకుంటారని, ఈయన మాత్రం ఇలా అంటున్నారని, చివరకు పుట్టుకను కూడా అవమానిస్తున్నారని.. ఇది దేనికి దారితీస్తుందో గమనించుకోవాలని చెప్పారు. ఆయన మాట్లాడే మాటల్లో ఒకదానికి, మరోదానికి పొంతన ఉండటంలేదన్నారు. జీడీపీ, జీఎస్‌డీపీ, ఎఫ్‌ఆర్‌బీఎం లాంటి పదాలతో సామాన్యులకు అర్థం కాకుండా మాట్లాడతారని విమర్శించారు. వాటి గురించి మాట్లాడుతూ మధ్యలో పుష్కరాల గురించి చెబుతారని, ప్రతిరోజూ తానే అక్కడ ఇన్‌స్పెక్షన్ చేశానంటారని అన్నారు. మామూలుగా అయితే అది ఒక ఏఈ లేదా డీఈ చేయాల్సిన పని అని, దానికి తాను వెళ్లానని చెబుతూ గొప్పలు చెప్పుకొంటారని విమర్శించారు.

2015-16 ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థూల ఉత్పత్తి 7.5 శాతం పెరిగితే, రాష్ట్రంలో జీఎస్‌డీపీ 10.99 శాతం పెరిగిందని ఈయన అంటున్నారని, కానీ  అదే కాలానికి కేంద్ర ప్రభుత్వానికి మొత్తం రాబడి 30 శాతం పెరిగితే మనకు మాత్రం కేవలం 13 శాతమే పెరిగిందని.. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అలాగే తాజాగా జరిగిన కలెక్టర్ల సదస్సులో 2016-17 సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 12.26 శాతం పెరుగుతోందని, జాతీయంగా మాత్రం 7.31 మాత్రమే పెరుగుతోందని చంద్రబాబు చెప్పారన్నారు. ఈ వివరాలన్నింటినీ తాము ముఖ్యమంత్రి కోర్ డాష్‌బోర్డు నుంచే తీసుకున్నామన్నారు. ఈయన లెక్కలు చూస్తే రాష్ట్రం ముందుకు పోతోందని అంతా అనుకుంటారని.. కానీ వాస్తవంలో మాత్రం అలా జరగడం లేదని వివరించారు. ముఖ్యమంత్రి ఈమధ్య ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేసినట్లు తరచు చెబుతున్నారని.. అది ఎప్పుడొచ్చిందో తమకు అనుమానంగానే ఉందని అన్నారు. ఆయనకు అమెరికాలోని ఒక యూనివర్సిటీ గౌరవ పీహెచ్‌డీ ఇస్తామంది గానీ, అది కూడా మూతపడిపోయిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో పరిపాలన మొత్తం స్తంభించిందని, రైతు గానీ, సామాన్య మానవుడు గానీ, రైతులు గానీ, ఉద్యోగులు గానీ ఎవరైనా సంతోషంగా ఉన్నారా అని బుగ్గన ప్రశ్నించారు. కేవలం మీరు, మీకు సంబంధించిన చుట్టుపక్కల వాళ్లు తప్ప ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారం మాత్రం చేయొద్దని ముఖ్యమంత్రిని కోరారు.

>
మరిన్ని వార్తలు