ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

26 Jun, 2015 04:47 IST|Sakshi
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

- భార్యతోపాటు ముగ్గురు నిందితుల అరెస్టు
దొడ్డబళ్లాపురం:
ప్రియుడి మోహంలో పడిన భార్య తాళి కట్టిన భర్తనే కిరాతకంగా హత్య చేసింది. ఈ సంఘటన తాలూకాలోని దొడ్డబెళవంగల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు భార్యతో కలిపి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. హత్యకు గురైన వ్యక్తిని హిందూపురానికి చెందిన మంజునాథ్ బాబు(25)గా గుర్తించారు. హత్యకు సంబంధించి మృతుడి భార్య సరస్వతి(19), ఆమె ప్రియుడు హరీష్, అతని బంధువు జగదీష్‌లను ఒడ్డబెళవంగల పోలీసులు అరెస్టు చేశారు. 40 రోజుల క్రితం దొడ్డబెళవంగల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మూగేనళ్లి గేట్ వద్ద ఉన్న నీలగిరి తోపులో సగం కాలిన శవం లభిం చింది.

ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు హతుడిని గుర్తించారు. గౌరిబిదనూరు తాలూకాలోని కురుగోడు తమ్మనహళ్లికి చెందిన సరస్వతికి సమీపంలోని కాచమాచనహళ్లికి చెందిన హరీష్‌తో వివాహానికి ముందే ఐదేళ్లుగా సంబంధం ఉండేది. అయితే పెద్దల మాట కాదనలేక సరస్వతి హిందూపురానికి చెందిన బెంగళూరు ఆంధ్రహళ్లిలో ఫ్యాక్టరీలో పని చేస్తున్న మంజునాథ్ బాబును వివాహం చేసుకుంది. ఈ క్రమంలో సరస్వతి అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్లాలని చెప్పి ప్రియుడిని కలుస్తుండేది.

ఒక రోజు అర్ధరాత్రి సరస్వతి ప్రియుడితో మాట్లాడుతున్నప్పుడు విన్న మంజునాథ్ బాబు దీన్ని ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భర్త వేధింపులు ఎక్కువవడంతో విసిగిపోయిన సరస్వతి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడానికి నిర్ణయించుకుంది. పథకంలో భాగంగా సరస్వతి ఒకరోజు పుట్టింటికి వెళ్లి మే 16వ తేదీన తనను అర్జెంటుగా పుట్టింటి నుంచి తీసుకువెళ్లాలని భర్తకు ఫోన్ చేసింది. భార్యను తీసుకు వెళ్లడానికి మంజునాథ్‌బాబు రాత్రి 9 గంటల సమయంలో గౌరిబిదనూరు బస్టాండులో దిగాడు. అప్పటికే బస్టాండులో ఇండికా కారుతో వేచి ఉన్న హరీష్, జగదీష్ ఇద్దరూ గ్రామానికి తీసుకెళ్తామని చెప్పి మంజునాథ్‌బాబును కారులో ఎక్కించుకున్నారు. కారులోనే తాడుతో గొంతు బిగించి హత్య చేసి దొడ్డబళ్లాపురం తాలూకా మూగేనహళ్లి గేట్ వద్ద శవాన్ని తెచ్చి కాల్చి వేశారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు