ప్రేమించి పెళ్లాడాడు.. పది రోజుల్లోనే గెంటేశాడు..

26 Jun, 2014 08:18 IST|Sakshi
ప్రేమించి పెళ్లాడాడు.. పది రోజుల్లోనే గెంటేశాడు..

చిలమత్తూరు :  ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మోసం చేసి తనను వదిలించుకోవడానికి ప్రయత్నించడంతో ఓ ఇల్లాలు అత్తారింటి ముందు ధర్నాకు దిగింది. మండల పరిధిలోని మొరసనపల్లిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దంపతులు ఈడిగ సువర్ణమ్మ, వెంకటేశుల కుమారుడు శివకుమార్(25) బెంగళూరులోని బూమర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు.

అప్పుడప్పుడు ఊరికి వచ్చి వెళ్లేవాడు. ఆ సమయంలో తన మేనమామ కూతురైన సునీత(20)తో సన్నిహితంగా ఉండేవాడు. ఏడాదిగా ఇరువురూ ప్రేమించుకుంటున్నారు. దీంతో సునీత పెళ్లి ప్రస్తావన తేవడంతో శివకుమార్ కూడా సరేనంటూ పెళ్లి తేదీని నిర్ణయించుకున్నారు. అయితే అతని తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడంతో.. కాదనలేని పెళ్లిని వాయిదా వేస్తూ తప్పించుకుని తిరిగాడు. అతని మోసాన్ని గ్రహించిన సునీత గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించింది.

అయినా శివకుమార్, అతని తల్లిదండ్రుల మనసు మారలేదు. చేసేది లేక బాధితురాలు ఈ ఏడాది ఫిబ్రవరి 10న చిలమత్తూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు శివకుమార్‌ను స్టేషన్‌కు రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చి, ఇరువురూ మేజర్లు కావడంతో పెళ్లికి ఒప్పించారు.  అదే రోజు సాయంత్రం బాగేపల్లిలోని గడిదం వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెద్దలు వీరి పెళ్లి చేశారు. కీనీ అతని తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వక పోవడంతో భార్యతో పాటు బెంగళూరుకు వెళ్లాడు.

అనంతరం పది రోజుల పాటు కాపురం చేశారు. అప్పటికీ తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పలేని శివకుమార్, భార్యను వదిలించుకోవాలన్న దురుద్దేశ్యంతో ఆమెకు మాయ మాటలు చెప్పి పుట్టింటికి పంపాడు. ఆనక నువ్వంటే అమ్మకు ఇష్టం లేదు.. విడాకులివ్వు.. వేరే పెళ్లి చేసుకుంటా.. లేకుంటే నీకు చేతనైంది చేసుకో.. అంటూ అసలు విషయం వెళ్లగక్కాడు. దీంతో బాధితురాలు మళ్లీ పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది.

ఈ నేపథ్యంలో మండల కుటుంబ సలహా కేంద్రం కమిటీ పాయింట్ పర్సన్ పద్మావతి, సభ్యులు మంజులమ్మ, లక్ష్మిదేవి, పద్మావతి, లక్ష్మిదేవి, రత్నమ్మ, పద్మావతి అండగా నిలిచారు. దీంతో బుధవారం వారితో పాటు ఆ గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో శివకుమార్ ఇంటి ముందు ధర్నాకు దిగారు.

అప్పటికే అత్తారింటి వారు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా కొనసాగించారు. శివకుమార్ తన మనసు మార్చుకుని భార్యను ఇంటికి తీసుకెళ్లే దాకా తాము బాధితురాలికి అండగా ఉంటామని, మరో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తే వదిలేది లేదని మహిళా సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
 

>
మరిన్ని వార్తలు