కెప్టెన్ కింగ్

25 Feb, 2016 02:51 IST|Sakshi
కెప్టెన్ కింగ్

 డీఎండీకే అధినేత విజయకాంత్ గొడుగు నీడన ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు కమలనాథులు సన్నద్ధం అవుతున్నారు.కెప్టెన్‌ను కింగ్ చేయడానికి రెడీ అంటూ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు వ్యాఖ్యానించి ఉన్నారు. ఇక ప్రజా కూటమి విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే విషయాన్ని పరిశీలనలో ఉంచింది.
 
 సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం డీఎండీకే అధినేత విజయకాంత్ చుట్టూ సాగుతున్న విషయం తెలిసిందే. ఆయన్ను తమ వైపు తిప్పుకునే యత్నం చేసి డీఎంకే దాదాపుగా విరమించుకుందని చెప్పవచ్చు. బీజేపీ, ప్రజా కూటమి ఇంకా ఆశతో ఎదురు చూస్తున్నాయి. అయితే ఒకరి గొడుగు నీడన తాను నిలబడడం కన్నా, తన గొడుగు నీడన ఇతరులు రావాలన్న కాంక్షతో విజయకాంత్ వ్యూహ రచనల్లో ముని ఉన్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా  తాను ‘కింగ్’ కావాలో, లేదా కింగ్ మేకర్ కావాలో కార్యకర్తల అభీష్టానికి వదిలి వేస్తున్నట్టుగా కాంచీపురం మహానాడులో విజయకాంత్ ప్రకటించారు. తన ఎన్నికల మేనిఫెస్టోలో కొంత భాగా న్ని ప్రకటించేశారు.
 
  తాను సీఎం కావాలన్న కాంక్ష విజయకాంత్‌లో పెరిగి ఉండడాన్ని బీజేపీ, ప్రజా కూటములు పరిగణనలోకి తీసుకునే పనిలో పడ్డాయి. విజయకాంత్‌తో దోస్తీ కట్టని పక్షంలో ఒంటరిగా మిగులుతామన్న ఆందోళనలో ఉన్న  కమలనాథులు ఆయన్ను కింగ్‌గా చూడడానికి సిద్ధం అయ్యారు. విజయకాంత్ సీఎం అభ్యర్థిగా ప్రకటించేం దుకు తగ్గ కూటమికి బీజేపీ సిద్ధం అవుతున్నది. ఇందుకు తగ్గట్టుగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు స్పందిం చడం గమనార్హం. విజయకాంత్‌ను కింగ్‌ను చేయడానికి తాము సిద్ధం అని వ్యాఖ్యానించి ఉండడం ఆలోచించాల్సిందే. విజయకాంత్‌ను కింగ్ గా చూడడానికి బీజేపీ సిద్ధం కావడంతో, ఆయన మద్దతు కోసం తీవ్ర కుస్తీలు పడుతున్న ప్రజా కూటమి పరిశీలనలో పడింది.
 
 ప్రజా కూటమిలోని ఎండీఎంకే, వామపక్షాలు, వీసీ కే వర్గాలు విజయకాంత్ వ్యూహాల్ని పరిశీలిస్తూ, అందుకు తగ్గట్టుగా అడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నారు. విజయకాంత్‌ను కింగ్ చేయడానికి తామూ సిద్ధం అని, అయితే ఆయన ప్రజా కూటమిలోకి రావాల్సి ఉంటుందని వీసీకే నేత తిరుమావళవన్ వ్యాఖ్యానించడం గమనార్హం. తన వ్యూహాలకు పదును పెట్టి విజయకాంత్ కింగ్‌గా అవతరించే యత్నం చేస్తారా? లేదా, అధికారాన్ని శాసించే దిశగా కింగ్ మేకర్ అయ్యే మార్గాన్ని ఎంచుకుని డీఎంకే వైపు అడుగులు వేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.
 

>
మరిన్ని వార్తలు