కరువుపై గళం

22 Nov, 2016 03:27 IST|Sakshi
సాక్షి,బెంగళూరు:  శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజే వేడి రాజుకుంది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు చట్టసభలను కుదిపేశాయి. సమస్యల పరిష్కారం కోసం బెళగావికి చేరుకుంటున్న రైతుల అరెస్టును ఖండిస్తూ విపక్షాలు అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించాయి. ఈ ఏడాది శీతాకాల శాసనసభ సభలు బెళగావిలోని సువర్ణ విధానసౌధలో సోమవారం నుంచి లాంఛనంగా ప్రారంభమయ్యాయి. విధానసౌధలో  జగదీష్‌శెట్టర్ మాట్లాడుతూ.... సమస్యలను ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడానికి బెళగావికి వస్తున్న రైతులను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేయడం, మండ్య, మైసూరు వంటి చోట్ల శాంతిభత్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ మరికొంతమందిని అదుపులోకి తీసుకోవడం తుగ్లక్ పాలనను గుర్తుకు తెస్తోందని వ్యంగమాడారు. ఈ సమయంలో అధికార, విపక్షనాయకులు మధ్య వాగ్వాదం చెలరేగింది. అరుునా వెనక్కు తగ్గని బీజేపీ నేతలు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  జేడీఎస్ శాసనసభ్యులు సైతం వారికి మద్దతుగా  వెల్‌లోకి దూసుకెళ్లారు.
 
  రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వం డౌన్‌డౌన్ అంటూ సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలుగజేసుకుని సువర్ణ విధానసౌధ చుట్టూ నిషేదాజ్ఞలు ఉండటం వల్ల ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు రైతులను అదుపులోకి మాత్రమే తీసుకున్నారన్నారు. ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. వారిని వదిలిలేయాలని ఆదేశాలను జారీ చేశామన్నారు. ఎవరి పైనా కేసులు నమోదు చేయలేదని స్పష్టం చేశారు. అయినా విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.  ఎట్టకేలకు స్పీకర్ కలుగజేసుకోవడంతో పరిస్థితి సద్దు మణిగింది.  
 
 పరిషత్‌లో కూడా... 
 పరిషత్‌లో కూడా రైతుల అరెస్టుపై విపక్షాలు ప్రభుత్వ చర్యలను తప్పుపట్టాయి. అనంతరం మండలి విపక్షనేత కే.ఎస్ ఈశ్వరప్ప కరువుపై చర్చకు పట్టుబట్టారు. అయితే అక్కడే ఉన్న మండలి నాయకుడు పరమేశ్వర్ అడ్డుచెప్పారు.
 
  మొదట ప్రశ్నోత్తరాలకు అవకాశం కల్పించాలని అటుపై వివిధ అంశాలపై చర్చలు జరపాలని పేర్కొన్నారు. దీంతో కే.ఎస్ ఈశ్వరప్ప ఆగ్రహం వ్యక్త చేశారు. ‘ప్రభుత్వానికి ప్రజాసమస్యలపై చిత్తశుద్ధిలేదు. అందువల్లే కరువుపై చర్చిచండానికి కాంగ్రెస్ నేతలు సిద్ధంగా లేరు’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. జేడీఎస్ ఎమ్మెల్సీలు కలుగజేసుకుని కరువుతో పాటు పెద్దనోట్ల రద్దు వల్ల రైతులు,   కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండలి దృష్టికి తీసుకువచ్చారు.  గంభీరత దృష్ట్యా మొదట కరువుపై చర్చకు అనుమతివ్వాలని మండలి అధ్యక్షుడు శంకరమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమయంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. 
 
  శంకరమూర్తి కలుగజేసుకుని విపక్షనాయకుడు కరువుపై ప్రస్తావించాలని, చర్చ మాత్రం ప్రశ్నోత్తరాల తర్వాత జరుగుతుందని స్పష్టంచేశారు. ఒక్క పైసా కూడా విడుదల కాలేదు... కరువు పరిస్థితులపై కే.ఎస్ ఈశ్వరప్ప మండలిలో మాట్లాడారు. ‘రాష్ట్రంలో  139 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. కరువు నివారణకు   ప్రతి తాలూకాకు రూ.50 లక్షలు అదంజేశామని ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటి వరకూ ఒక్క పైసా కూడా విడుదల కాలేదు. కరువు పరిహారం కోసం ప్రత్యేకంగా రూ.10వేల కోట్ల నిధులను కేటాయించాలి’ అని డిమాండ్ చేశారు.  ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు రూ.96,834 కోట్లు కాగా అందులో రూ.12,850 కోట్లు ప్రభుత్వ బ్యాంకులు, సహకార సంఘాల్లో తీసుకొన్నవేనన్నారు.  
 
 ఆ రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో కేంద్రాన్ని తప్పు పట్టడం సిద్ధరామయ్య ప్రభుత్వానికి ఫ్యాషన్ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొదట తన వాటాను విడుదల చేసి రైతు సంక్షేమం విషయంలో తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని ఈశ్వరప్ప ప్రభుత్వానికి సవాలు విసిరారు. ఈ సమయంలో తిరిగి గందరగోళం చెలరేగినా మండలి అధ్యక్షుడు శంకరమూర్తి కలుగజేసుకోవడంతో  సభా కార్యాక్రమాలు సజావుగా కొనసాగాయి. కాగా, అంతకు ముందు ఇటీవల చనిపోయిన ప్రజాప్రతినిధులకు, అప్పులబాధతో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు ఉభయ సభల్లో ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించారు.  
 
Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా