అమ్మ చనిపోయాక.. మళ్లీ వచ్చాడు

12 Dec, 2016 14:32 IST|Sakshi
అమ్మ చనిపోయాక.. మళ్లీ వచ్చాడు

చెన్నై: జయలలిత జీవితంలో శశికళకు ఎంతో ప్రాధాన్యం ఉంది. విభేదాల వల్ల శశికళను ఇంట్లోంచి పంపించినా జయలలిత మళ్లీ ఆమెను దగ్గరకు తీసుకున్నారు. అయితే జయలలిత బతికున్న రోజుల్లో తన పోయెస్‌ గార్డెన్‌ బంగ్లాలోకి శశికళ భర్త నటరాజన్‌ను అనుమతించలేదు. గత ఐదేళ్లుగా ఆయన దూరంగా ఉన్నారు. జయలలిత మరణించిన తర్వాత నటరాజన్‌ ఆ ఇంట్లో మళ్లీ అడుగుపెట్టారు. ఇప్పుడు అన్నా డీఎంకే రాజకీయాల్లో శశికళతో పాటు ఆయన భర్త కీలకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. పోయెస్‌ గార్డెన్‌లో ప్రస్తుతం శశికళ దంపతులతో పాటు వారి సమీప బంధువులు ఉన్నారు.

సోమవారం రాత్రి చెన్నై అపోలో ఆస్పత్రిలో జయలలిత మరణించిన తర్వాత శశికళ బంధువులు అక్కడికి చేరుకున్నారు. జయలలిత భౌతికకాయం చుట్టూ వాళ్లే కనిపించారని, జయ బంధువులను దగ్గరకు రానివ్వలేదనే విమర్శలు వచ్చాయి. ఇక జయలలిత అంతిమసంస్కారాలను శశికళ చేశారు. తమిళనాడు ముఖ‍్యమంత్రిగా పన్నీరు సెల్వం బాధ్యతలు చేపట్టగా, పార్టీ పగ్గాలు శశికళ చేతిలోనే ఉన్నాయి. శశికళను తన వారసురాలిని చేయాలన్నది జయలలిత చివరి కోరికని, అయితే ఆమె కోరిక నేరవేరలేదని నటరాజన్‌ పార్టీ నాయకులతో చెబుతూ భార్యను అందలమెక్కించేందుకు పథకం పన్నారని అన్నా డీఎంకే సీనియర్‌ నాయకుడు ఒకరు చెప్పారు. ఓ సాధారణ వ్యక్తి పార్టీని నడిపించగలరని నటరాజన్‌ వ్యాఖ్యలు చేసినట్టుగా మీడియాలో వచ్చింది. అధికారం కోసం అన్నా డీఎంకేలో విభేదాలు వస్తాయని, పార్టీలో చీలిక​ తప్పదని కొందరు రాజకీయ నేతలు చెబుతున్నారు. అన్నా డీఎంకే రాజకీయాలు ఎటు దారి తీస్తాయో కాలమే నిర్ణయిస్తుంది.
 

మరిన్ని వార్తలు