పరామర్శల హోరు

19 Dec, 2016 01:41 IST|Sakshi

మెరుగ్గా కరుణ ఆరోగ్యం
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం మరింత మెరుగు పడ్డట్టు కావేరి ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అలాగే, అధినేత ఆరోగ్యంగా ఉన్నారని ఆందోళన వద్దంటూ కేడర్‌కు  డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ భరోసా ఇచ్చారు. శ్వాస సమస్య, గొంతు ఇన్ఫెక్ష¯ŒSతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి మరో మారు ఆళ్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రిలో గురువారం చేరిన విషయం తెలిసిందే. ఆయనకు ఆసుపత్రి వర్గాలు తీవ్ర చికిత్స అందిస్తూ వచ్చాయి. నాలుగో రోజు ఆదివారం కరుణానిధి ఆరోగ్యం మరింత మెరుగు పడ్డట్టు ఆసుపత్రి వర్గాలు ప్రకటిం చాయి. సహజరీతిలో శ్వాస తీసుకుంటున్నారని, ఒకటి రెండు రోజు ల్లో డిశ్చార్జ్‌ అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నాయి. కరుణ ఆరోగ్యం మెరుగుపడడంతో పార్టీ కార్యక్రమాలపై డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ దృష్టి పెట్టారు.

ఆదివారం నామక్కల్‌లో యువజన విభాగం నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో స్టాలిన్ ప్రసంగిస్తూ అధినేత ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేడర్‌కు సూచించారు. ఇక, ఆ కార్యక్రమం వేదికగా యువత, విద్యార్థులు రాజకీయాల వైపు మొగ్గు చూపించాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. ఇక, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్, తమిళ మానిల కాంగ్రెస్‌ నేత జీకే వాసన్, వర్తక సమాఖ్య నేత విక్రమరాజా,  తమిళర్‌ వాల్వురిమై కట్చి నేత వేల్‌ మురుగన్, కాంగ్రెస్‌ నేతలు కేవీ తంగబాలు, కుమరి ఆనందన్, వ్యవసాయ సంఘం నేత పీఆర్‌.పాండియన్, దక్షిణ భారత నటీ నటుల సంఘం కార్యదర్శి విశాల్, హాస్య నటుడు వడివేలు    పరామర్శించారు.

ఆసుపత్రి ఆవరణలో కరుణ గారాల పట్టి కనిమొళి, డీఎంకే బహిష్కృత నేత, కరుణ పెద్దకుమారుడు అళగిరిల వద్ద ఆరోగ్య పరిస్థితి గురించి విచారించారు. వైద్యులతో మాట్లాడారు. ఈసందర్భంగా మీడియాతో నారాయణస్వామి మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా కరుణానిధి ప్రజాసేవకు మళ్లీ అంకితం కావాలని ఆకాంక్షించారు. వైద్యుల్ని సంప్రదించామని, రెండు, మూడు రోజుల్లో ఆయన ఇంటికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నారు.


తమిళ మానిల కాంగ్రెస్‌ నేత జీకే వాసన్ మాట్లాడుతూ ఆరోగ్యంగా కరుణానిధి ఉన్నారని, ప్రజలకు, డీఎంకేకు ఆయన సేవలు కొనసాగాలని, వంద శాతం సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఆయన ఆసుపత్రి నుంచి బయటకు రావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై అన్నాడీఎంకే తరఫున రాష్ట్ర మంత్రి జయకుమార్, ఎంపీ, పార్లమెంట్‌ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై ఆసుపత్రికి వచ్చి విచారించడం ఆరోగ్యకర, నాగరికతతో కూడిన రాజకీయ వాతావరణానికి నాందిగా డీఎంకే సీనియర్‌ నేత దురైమురుగన్ వ్యాఖ్యానించారు. ఇందుకుగాను చిన్నమ్మ శశికళను అభినందించారు. ఇక, కరుణానిధిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన ఎండీఎంకే నేత వైగోను డీఎంకే వర్గాలు అడ్డుకున్న విషయం తెలిసిందే.


ఈ ఘటనపై డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని కేడర్‌కు విజ్ఞప్తి చేశారు. వైగోను డీఎంకే వర్గాలు అడ్డుకున్న సమాచారంతో స్టాలిన్ విచారం వ్యక్తం చేయడాన్ని తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ ఆహ్వానించారు.

మరిన్ని వార్తలు