వరకట్న వేధింపులు తాళలేక

14 Oct, 2016 01:54 IST|Sakshi

మహిళ సజీవ దహనం
వేలూరు: వరకట్న వేధింపులతో ఓ మహిళ సజీవ దహనమైంది. ఈ ఘటన వందవాసిలో చోటుచేసుకుంది. తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపంలోని సూతంబేడు గ్రామానికి చెందిన తంగరాజ్ భార్య తమిళరసి(25) వీరికి రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆ సమయంలో 15 సవరాల బంగారం, పెళ్లి సామాగ్రిని మహిళ  తల్లిదండ్రులు కట్నంగా అందజేశారు. వివాహం జరిగి కొద్ది రోజులు మాత్రమే తంగరాజ్, ఇళవరసి కలిసి సంతోషంగా జీవించారు. అనంతరం అదనపు కట్నం తేవాలని కోరుతూ భర్త తంగరాజ్, అతని కుటుంబ సభ్యులు తరచూ వేధించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈనెల 7వ తేదీన ఇంట్లో ఉన్న ఇళవరసి కాలిన గాయాలతో ఉన్న విషయాన్ని స్థానికు లు గమనించారు.

దాదాపు 90 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న ఇళవరసిని స్థానికులు వందవాసి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చెన్నై కీల్‌పాక్కం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో తమిళరసి వద్ద న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. వరకట్నం కోసం తన ను చిత్ర హింసలు పెట్టి తనను కిరోసిన్ పోసి కాల్చారని తెలిపినట్లు తెలిసింది. ఇందుకు కారణం భర్త తంగరాజ్, అమ్మ పెరియమ్మాల్, భర్త అన్న సెల్వమణి, చెల్లెలు విమల నలుగురు కారణమని వాంగ్మూలం ఇచ్చింది. ఇదిలా ఉండగా తమిళరసి చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది.

వీటిపై పోలీసులకు మహిళ తల్లి దండ్రులు ఫిర్యాదు చేయడంతో హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న తంగరాజ్‌తో పాటు కుటుంబ సభ్యులు నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివాహం జరిగి రెండు సంవత్సరాలు కావడంతో సెయ్యారు సబ్ కలెక్టర్ ప్రభు శంకర్ విచారణ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు