శభాష్‌ ఈశ్వరి

20 Nov, 2017 07:30 IST|Sakshi
ఈశ్వరి

ప్రభుత్వ పాఠశాలకు 4.6ఎకరాల స్థలం విరాళం

తండ్రి, తమ్ముడి చివరి కోరిక నెరవేర్చిన మహిళ

సేలం : పెద్దల ఆస్తి తోబొట్టువులకు ఇవ్వడానికే నిరాకరించే వారున్న ఈ రోజుల్లో ఓ మహిళ తన తండ్రి, తమ్ముడి చివరి కోరిక మేరకు రూ.కోటి విలువైన నాలుగున్నర ఎకరాల భూమిని ప్రభుత్వ పాఠశాలకు అందించి దాతృత్వం చాటుకున్నారు. ఈరోడ్‌ జిల్లా కాట్టూర్‌కు చెందిన రైతు చిన్ననాచ్చిముత్తు(75) గత నెల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనకు కుమార్తె ఈశ్వరి(52), కుమారుడు నటరాజన్‌(47) ఉన్నారు. నటరాజన్‌ అనారోగ్యం కారణంగా పదేళ్ల పాటు మంచానికే పరిమితమై 2014లో మృతి చెందాడు. నటరాజన్‌ చివరి రోజుల్లో తనకు వాటాగా వచ్చే ఆస్తిని తమ స్వగ్రామమైన ఈరోడ్‌ జిల్లా అమ్మాపాలయంలోని ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వాలని తండ్రికి తెలిపి కన్నుమూశాడు. కుమారుడి చివరి కోరిక నెరవేర్చేందుకు చిన్ననాచ్చిముత్తు తన ఆస్తిలో నటరాజన్‌ వాటాగా రూ.కోటి విలువైన 4.60 ఎకరాల భూమిని అమ్మపాలయంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందే విధంగా వీలునామా రాసి కుమార్తె ఈశ్వరికి అప్పగించాడు.

ఈ క్రమంలో చిన్ననాచ్చిముత్తు మృతి చెందడంతో ఆయన రాసిన వీలునామాను ఇటీవల ఈశ్వరి ఈరోడ్‌ జిల్లా చీఫ్‌ ఎడ్యుకేషన్‌ అధికారికి అప్పగించారు. ఈ విషయాన్ని ఆదివారం ఆమె మీడియాకు తెలియజేశారు.  ఆ వివరాలు ఆమె మాటల్లో.. ‘‘నా తండ్రి చిన్ననాచ్చిముత్తు చేనేత కార్మికుడు. అతి కష్టం మీద మమ్మల్ని చదివించాడు. నా తమ్ముడు నటరాజన్‌ ఈరోడ్‌లో ప్రైవేటు కళాశాలలో బీబీఎం చదువుకున్నాడు. ఉన్నత చదువులు చదువుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ నేరుగా వెళ్లి చదువుకోలేని పరిస్థితిలో పోస్టల్‌లోనే ఎంబీఎ, ఎంఫిల్‌ను చదువుకున్నాడు. పీహెచ్‌డీ పూర్తి చేసి, ఉద్యోగం చేయాలనేదే నా తమ్ముడి కోరిక. అది నెరవేరకుండానే అనారోగ్యంతో మృతి చెందాడు. తమ్ముడి చివరి కోరిక మేరకు అతని వాటాగా వచ్చిన స్థలాన్ని ప్రభుత్వ పాఠశాల నిర్వాహకులకు అప్పగించాను’’ అని అన్నారు.

గ్రామస్తుల స్పందన
ఈశ్వరి కావాలనుకుంటే తండ్రి వీలునామాను దాచి ఆస్తిని తానే అనుభవించి ఉండొచ్చని, అయితే తండ్రి, తమ్ముడి చివరి కోరికను నెరవేర్చిన ఈశ్వరికి అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు