ప్రేమ వివాహం చేసుకుందని ...

25 Jun, 2014 13:12 IST|Sakshi
ప్రేమ వివాహం చేసుకుందని ...

తిరునల్వేలి సమీపంలో ప్రభుత్వ బస్సును అటకాయించి ప్రేమ వివాహం చేసుకున్న యువతిని ఒక ముఠా కారులో కిడ్నాప్ చేసింది. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ప్రేమికుడు దాడికి గురయ్యాడు. దీనికి సంబంధించి మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్ సహా నలుగురిపై కేసు దాఖలైంది. రాధాపురం సమీపం ఆవరై కుళం అంబలవానపురానికి చెందిన రాజదురై కుమారుడు శంకర్ (26). ఆరల్‌వాయ్‌మొళిలోగల కళాశాలలో చదువుతున్నారు. ఇతనికి, కన్యాకుమారి జిల్లా రామపురం సమీపాన కులశేఖరన్ పుదూర్‌కు చెందిన ఇసక్కి యప్పన్ కుమార్తె గంగ (21)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిరువురు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో గంగా తల్లిదండ్రులు వివాహానికి వ్యతిరేకత తెలిపారు.
 
ప్రేమికులు ఇరువురు స్నేహితుల సాయంతో ఇడలాకుడి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 10, మార్చి 2014న రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. గంగను విడిపించాలని కోరుతూ ఆమె తండ్రి ఇసక్కియప్పన్ మదురై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. సుశీంద్రం సబ్ ఇన్‌స్పెక్టర్ జయంతి, పోలీసులు విచారణ జరిపి, గంగా, ఆమె ప్రేమికుడు శంకర్‌లను మదురై హైకోర్టులో సోమవారం హాజరుపరిచారు. ఆ సమయంలో గంగ తన భర్త శంకర్‌తోనే జీవిస్తానని తెలిపింది. దీంతో గంగ, ఆమె తల్లిదండ్రులు ప్రేమికుడు శంకర్, సోమవారం సాయంత్రం ప్రభుత్వ బస్సులో నాగర్‌కోయిల్‌కు బయలుదేరి వచ్చారు.
 
సబ్ ఇన్‌స్పెక్టర్ జయంతి కూడా వారితో వచ్చారు. నాంగునేరి టోల్‌గేట్‌కు అర్ధరాత్రి 11 గంటల సమయంలో బస్సు చేరుకోగా, అక్కడికి కారులో వచ్చిన నలుగురు మారణాయుధాలతో బస్సును అటకాయించి గంగను కిడ్నాప్ చేశారు.  శంకర్ ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అతనిపై దాడి చేసిన ముఠా గంగను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లింది. దాడిలో గాయపడ్డ శంకర్‌ను నాంగునేరి ఆస్పత్రికి తరలించారు.

గంగను కిడ్నాప్ చేస్తున్న సమయంలో బస్సులో ఉన్న ఎస్‌ఐ జయంతి, సిబ్బంది కిడ్నాప్ ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. శంకర్ నాంగునేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ నాగకుమారి విచారణ జరిపి గంగ తండ్రి ఇసక్కియప్పన్, తల్లి లక్ష్మి, బంధువు సుబ్బయ్య, సబ్ ఇన్‌స్పెక్టర్ జయంతిపై కేసు దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు