ఈశ్వరప్పా.. ఇవేం మాటలప్పా!

18 Oct, 2015 12:53 IST|Sakshi
ఈశ్వరప్పా.. ఇవేం మాటలప్పా!

బెంగళూరు: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రశ్నించిన ఓ మహిళా జర్నలిస్ట్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ ముఖ్య నేత కె.ఎస్. ఈశ్వరప్పపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. ఈశ్వరప్ప వ్యాఖ్యలను నిరసిస్తూ కర్ణాటక మహిళా కాంగ్రెస్, యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదివారం బెంగళూరులో భారీ ఆందోళన నిర్వహించారు. ఈశ్వరప్ప వ్యాఖ్యలతో బీజేపీ మహిళల పట్ల ఎలా ఆలోచిస్తోందో తెలుస్తున్నదని మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. ఈశ్వరప్పతోపాటు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కె.ఎస్‌.ఈశ్వరప్ప శనివారం ఒక మహిళా జర్నలిస్టుతో మాట్లాడుతూ.. 'ఎవరైనా అత్యాచారం చేస్తే మేమేం చేయగలం? మీరిక్కడ వున్నారు, ఎవరైనా మిమ్మల్ని ఎత్తుకువెళ్ళి అత్యాచారానికి పాల్పడితే ప్రతిపక్షం ఏం చేస్తుంది?' అని ప్రశ్నించారు. ఈశ్వరప్ప వ్యాఖ్యలతో కంగుతిన్న జర్నలిస్టులు అక్కడిక్కడే ఆయనకు నిరసన తెలిపారు. అన్ని రాజకీయపక్షాలు ఆ వ్యాఖ్యలను తప్పుపట్టాయి. దీంతో ఈశ్వరప్ప సారీ చెప్పి, తన వ్యాఖ్యలను వెనక్కితీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈశ్వరప్ప ఉదంతానికి కొద్ది రోజుల ముందు కర్ణాటకకే చెందిన కె.జె. జార్జ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇద్దరు పురుషులు ఒక మహిళను రేప్‌ చేస్తే అది గ్యాంగ్‌రేప్‌ కాదని, నలుగురైదుగురు చేస్తేనే దాన్ని సామూహిక అత్యాచారం అనాలంటూ రేప్ కు నిర్వచనం ఇచ్చారు.

మరిన్ని వార్తలు