నారి- సమరభేరి

29 Nov, 2013 00:47 IST|Sakshi
ఎన్నికల సమయంలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు నానాతంటాలు పడుతున్న దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వివిధ పథకాలను ప్రకటిస్తున్నాయి. గడచిన ఏడాదికాలంలో ఢిల్లీలో మహిళలపై నేరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. ఒకవైపు మహిళలకు భద్రత కల్పించాలనే డిమాండ్‌తోపాటు వారి హక్కుల పరిరక్షణ కోసం పలు రూపాల్లో ఉద్యమాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులు, లింగ వివక్ష నుంచి విముక్తి కల్పించాలంటూ అనేక మహిళా సంఘాలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తదుపరి ఏర్పాటయ్యే ప్రభుత్వం.... రాజధాని నగరంలో మహిళల కోసం అవలంబించాల్సిన విధివిధానాలపై రెండు స్వచ్ఛంద మహిళా సంస్థలు మేనిఫెస్టోను విడుదల చేశాయి. 
 
 న్యూఢిల్లీ:దేశ రాజధానిలోనే తొలిసారిగా రెండు ప్రముఖ మహిళా సంఘాలు గురువారం ఓ మేనిఫెస్టోను విడుదల చేశాయి. తమ తమ మేనిఫెస్టోలో మహిళలపట్ల వివక్ష సమస్య పరిష్కారానికి కట్టుబడాలని ఆయా పార్టీలకు ఈ రెండు సంఘాలు ఈ సందర్భంగా సూచించాయి. సార్వత్రిక, శాసనసభ ఎన్నికల్లో తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని అవి సూచించాయి. మహిళా వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ సంస్థతోపాటు, ఉమెన్ పవర్ కనెక్ట్ (డబ్ల్యూపీసీ)లు ముసాయిదా ప్రణాళికను తయారుచేశాయి. ఈ విషయమై సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ సంస్థ డెరైక్టర్ రంజనాకుమారి మాట్లాడుతూ ‘మహిళల పట్ల వివక్షను అంతమొందించే విషయంలో నిబద్ధతతో వ్యవహరించాలి. రాజకీయ పార్టీలన్నీ మహిళలపట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. సమాజంలో లింగ సమానత్వాన్ని అమల్లోకి తీసుకొస్తామంటూ హామీ ఇవ్వాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేపట్టి 17 సంవత్సరాలైంది.
 
 అందువల్ల మా పిలుపునకు అన్ని రాజకీయ పార్టీలు స్పందించాల్సిన తరుణమిదే’నని అన్నారు. కాగా మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో రంజనాకుమారి, డబ్ల్యూపీసీ సీనియర్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ రాధికా ఖజూరియా, స్త్రీ శక్తి సంస్థ అధ్యక్షురాలు రేఖామోడీ, ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్ సంస్థ అధ్యక్షురాలు బీనా జైన్‌లు పాల్గొన్నారు.కాగా శీతాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడతామంటూ ఇచ్చిన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఈ విషయమై సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ సంస్థ డెరైక్టర్ రంజనాకుమారి డిమాండ్ చేశారు. మహిళలకు భద్రత, పౌష్టికాహారం, విద్య, ఉపాధి అవకాశాలు, ఆరోగ్యం తదితర విషయాల్లో అన్నిపార్టీలు చురుకైన పాత్ర పోషించాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
 మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు తప్పనిసరిగా తమవంతు కృషి చేయాలన్నారు. మహిళలు, ఆడశిశువులపట్ల వివక్షను అంతమొందించాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని అన్నారు. దీనినే ఈ మేనిఫెస్టోలో పొందుపరిచామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కేడర్‌లో మహిళలు కూడా ఉండేవిధంగా చూడాలన్నారు. పార్టీలో లింగ సమానత్వం తప్పనిసరిగా పాటించేవిధంగా చేయాలన్నారు. అన్ని వ్యవస్థల్లోనూ మహిళా భాగస్వామ్యం ఉండేవిధంగా చూసుకోవాలన్నారు. 33 శాతం రిజర్వేషన్ అనేది మహిళల హక్కు అని పేర్కొన్నారు. వాస్తవానికి మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండాలని కోరుకోవడం లేదన్నారు. కేవలం 33 శాతం మాత్రమే కోరుతున్నామన్నారు. వ్యవస్థలను సక్రమంగా, సమర్థంగా నడపగలిగే సామర్థ్యం మహిళలకు ఉందని, అందువల్లనే వారికి ఇవ్వాలని కోరుతున్నామని ఆమె వివరించారు.
 
మరిన్ని వార్తలు