అమరావతిలో మహిళా పార్లమెంటేరియన్ల మహాసభ

8 Oct, 2016 19:52 IST|Sakshi
అమరావతిలో మహిళా పార్లమెంటేరియన్ల మహాసభ
-ఫిబ్రవరిలో నిర్వహించేందుకు సన్నాహాలు
 
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల మహాసభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు శాసనసభ స్పీకర్ కార్యాలయం తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి తొలివారంలో జరిగే ఈ మహాసభను పూణేలోని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ సమన్వయం చేయనుంది. కొన్ని నెలలుగా దీనిపై కసరత్తు చేస్తున్న స్పీకర్ కోడెల శివప్రసాదరావు శనివారం పూణే వెళ్లి ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ప్రతినిధి రాహుల్ వి.కరాడ్‌తో సమావేశమయ్యారు.

మూడురోజుల పాటు జరిగే ఈ సభల్లో దేశవ్యాప్తంగా 400కు పైగా మహిళా పార్లమెంట్, శాసనసభ సభ్యులు పాల్గొంటారు. దాదాపు పది వేల మంది విద్యార్థినులను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలని భావిస్తున్నారు. సమావేశాలకు ఛైర్మన్‌గా స్పీకర్ కోడెల శివప్రసాదరావు, చీఫ్ ప్యాట్రన్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించనుండగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుధా నారాయణమూర్తి వంటి ప్రముఖులు రానున్నారు. మహాసభలో మహిళా ప్రోత్సాహం-ప్రజాస్వామ్యం పటిష్టత’, మహిళా సాధికారి-రాజకీయ సవాళ్లు, వ్యక్తిత్వ నిర్మాణ-భవిష్యత్తు దార్శనికత, మహిళల స్థితి-నిర్ణయాత్మక శక్తి తదితర అంశాలపై ప్రముఖుల ప్రసంగాలుంటాయి.
 
కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కనీసం నాలుగు నెలల సమయం కావాలని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ కోరగా అందుకనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. సమావేశాలను కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్, భారతీయ ఛాత్ర సంసాద్ ఫౌండేషన్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్‌ల సహకారంతో ఏపీ శాసనసభ,న రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
 
మరిన్ని వార్తలు