నానాటికీ పెరుగుతున్న నేరాలు

16 Sep, 2013 23:59 IST|Sakshi
సాక్షి, ముంబై: నగరం నుంచి దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలో నేరాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దీంతో ఈ రైళ్లలో భద్రతను మరింత కట్టుదట్టం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సెంట్రల్, వెస్టర్న్ రైల్వేకిచెందిన అనేక రైళ్లు...  రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) భద్రతా సిబ్బంది లేకుండానే నడుస్తున్నాయి.  ప్రయాణికుల సంఘటన్ కార్యకర్త అనీస్‌ఖాన్ రైళ్లలో భద్రతపై సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద దరఖాస్తు చేయడంతో ఈ వివరాలు బహిర్గతమయ్యాయి. సెంట్రల్, వెస్టర్న్ రైల్వేల ఆధ్వర్యంలో రోజుకు 116 రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో కేవలం 59 రైళ్లలో మాత్రమే ఆర్పీఎఫ్ భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ రైల్వేలో 2,408 మంది భద్రతా సిబ్బంది నియామకానికి రైల్వే శాఖ అనుమతించింది.
 
 అదేవిధంగా వెస్టర్న్ రైల్వేలో 1,887 భద్రతా సిబ్బందిని నియమించుకునేందుకు కూడా అనుమతించింది. సెంట్రల్ రైల్వేలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్‌టీటీ), దాదర్ టెర్మినస్‌ల నుంచి ప్రతిరోజూ 76 రైళ్లు దూరప్రాంతాలకు వెళ్తున్నాయి. ఇందులో 28 రైళ్లలో మాత్రమే భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నారు. అదేవిధంగా వెస్టర్న్ రైల్వేలోని ముంబై సెంట్రల్, బాంద్రా టెర్మినస్‌ల నుంచి ప్రతిరోజూ దాదాపు 40 రైళ్లు దూర ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఇందులో 31 రైళ్లలో మాత్రమే భద్రతా సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. ఇవేకాకుండా వేసవి, దీపావళి ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు. అయితే రైళ్లలో నానాటికీ నేరాలసంఖ్య పెరిగిపోతుండడంతో భద్రతను కట్టుదిట్టం చేయడంకోసం సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. 
 
 సిబ్బంది సంఖ్య పెంచుతాం
 ఇదే విషయమై సెంట్రల్ రైల్వే ప్రధాన ప్రజాసంబంధాల అధికారి అతుల్ రాణే మాట్లాడుతూ భద్రతా సిబ్బందిని నియమించిన వెంటనే మొదట కీలక రైళ్లలో కొంతమందిని మోహరిస్తామన్నారు. అదేవిధంగా భద్రతాసిబ్బంది సంఖ్యను పెంచే ప్రయత్నంలో ఉన్నామన్నారు. ఇదే విషయమై వెస్టర్న్ రైల్వే ప్రజాసంబంధాల అధికారి సునీల్‌సింగ్ మాట్లాడుతూ.. నగరం నుంచి రాత్రివేళ్లలో దూరప్రాంతాలకు బయల్దేరే రైళ్లలో ఆర్పీఎఫ్ లేదా జీఆర్‌పీ భద్రతా సిబ్బందిని మోహరింపజేస్తున్నామన్నారు.  భద్రతా సిబ్బందిని  నియమించే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వివరించారు.
Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా