సుప్రీం తీర్పుతో అయోమయం

1 May, 2016 01:54 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఎంబీబీఎస్, బీడీఎస్‌ల ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు రాష్ట్రంలోని విద్యార్థుల్ని అయోమయంలో పడేసింది. నీట్ కచ్చితంగా రాయాల్సిందేనా అన్న ప్రశ్న తలెత్తి ఉన్నది. రాష్ట్రంలోని ఉన్నత విద్యా విధానం మేరకు ఆ పరీక్ష ఇక్కడ సాగేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య, దంత కళాశాలల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను ఆరోగ్య శాఖ భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. స్వయం ప్రతిపత్తి హోదా కల్గిన(ప్రైవేట్) కళాశాలల్లోని ప్రభుత్వ కోటా సీట్లను సైతం భర్తీ చేయడం జరుగుతున్నది. రాష్ర్టంలోని ఉన్నత విద్యా విధానం మేరకు ఏళ్ల తరబడి ప్రతి ఏటా ప్లస్‌టూలో విద్యార్థులు సాధించే మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపులు జరుగుతూ వస్తున్నాయి.
 
  ఇదే విధానం ఇంజనీరింగ్‌లోనూ కొనసాగుతున్నది. ఇంజనీరింగ్‌కు అన్నా వర్సిటీ, వైద్య కోర్సులకు రాష్ట్ర వైద్యవిద్యాశాఖ డెరైక్టరేట్ పర్యవేక్షలో దరఖాస్తుల్ని ఆహ్వానించడం, ర్యాండం నెంబర్ల కేటాయింపు, ప్లస్‌టూ మార్పుల ఆధారంగా కటాఫ్ మార్కు, ర్యాంక్‌ల జాబితా ఆధారంగా కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా సీట్ల భర్తీ సాగుతున్నది. అయితే ఈ  ఏడాది నీట్ ద్వారా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరగాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చి ఉన్నది. ఆదివారం, మే 24వ తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించేందుకు తగ్గ ఆదేశాలు కోర్టు జారీ చేసి ఉన్నది. ఒకటో తేది(ఆదివారం) పరీక్షలకు వ్యతిరేకత బయల్దేరింది. అదే సమయంలో 24వ తేదీ పరీక్షకు పెద్ద సంఖ్యలో దేశ వ్యాప్తంగా విద్యార్థులు హాజరు కావడం తథ్యం. అయితే, రాష్ట్రంలోని విద్యార్థులు ఈ పరీక్షలు రాయాలా? వద్దా అన్నడైలమాలో పడ్డారు. ఇందుకు కారణం రాష్ట్రంలో ఉన్న విద్యా విధానమే.
 
 అయోమయం: రాష్ట్రంలో 19 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో 2555 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 383 జాతీయ కోటాకు చేరుతుంది. మిగిలిన 2272 సీట్లను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. అలాగే, 12 స్వయం ప్రతిపత్తి హోదా(ప్రైవేటు) కళాశాలల్లో 1560 బీడీఎస్ సీట్లు ఉండగా,  646 సీట్లు యాజమాన్య కోటాకు చేరుతాయి. మిగిలిన 912 సీట్లు ప్రభుత్వం భర్తీ చేయనున్నది. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో చెన్నైలోని దంత వైద్య కళాశాలలో 85 సీట్లు ఉండగా, పదిహేను జాతీయ కోటాకు అప్పగించారు. అలాగే రాష్ట్రంలోని 18 దంత వైద్య కళాశాలల్లో 977 సీట్లు ప్రభుత్వ కోటా కింద ఉన్నాయి. ఈ సీట్ల కోసం రాష్ట్రంలోని విద్యార్థుల మధ్య గట్టి పోటీ  ఉంటుంది.
 
 తాజాగా ఉమ్మడి ప్రవేశ పరీక్షా విధానం మేరకు సీట్ల భర్తీ అన్న సుప్రీం కోర్టు ఆదేశాలు రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన పక్షంలో ఇక్కడి విద్యార్థులకు ఆ సీట్లు దక్కేది డౌటే. ఇందుకు నిదర్శనం సీబీఎస్‌ఈ సిలబస్ మేరకు ఆ పరీక్షలు జరుగుతాయి. అయితే, రాష్ట్రంలో ఏకీకృత విద్యావిధానం అమల్లో ఉండడంతో ఆ సిలబస్‌కు, రాష్ట్ర సిలబస్‌కు చాలా తేడా ఉన్నది. దీంతో విద్యార్థుల్లో ఆయోమయం, గందరగోళం, ఆందోళన తప్పడం లేదు. ఈ ప్రవేశ పరీక్షలు ఇక్కడ అమల్లోకి వచ్చిన పక్షంలో ఎక్కడ తమకు సీట్లు దక్కకుండా పోతాయో అన్న  ఉత్కంఠ నెలకొని ఉన్నది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలు తప్పని సరి చేసిన దృష్ట్యా, జాతీయ స్థాయి కోట భర్తీలో జాప్యం తప్పదేమో. దీంతో  ఈ ఏడాది ఉన్నత విద్యా సీట్ల భర్తీ కౌన్సెలింగ్‌లు మరింత ఆలస్యంగా సాగే అవకాశాలు కన్పించనున్నాయి.
 
 దీంతో విద్యార్థుల్లో అయోమయాన్ని తొలగించేందుకు తగ్గ కసరత్తుల్ని వైద్య విద్యా శాఖ చేపట్టి ఉన్నది. ఈ విషయంగా వైద్య విద్యా డెరైక్టర్ విమల స్పందిస్తూ, విద్యార్థులు ఆందోళన వీడాలని సూచించారు. రాష్ట్రంలో ఈ నెల ఎనిమిదో తేదీన వైద్య విద్యా కౌన్సెలింగ్ వివరాలను ప్రకటించి తీరుతామన్నారు. తొమ్మిదో తేదీ నుంచి దరఖాస్తుల విక్రయం తదుపరి ప్రక్రియలు సాగుతాయని వివరించారు. సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించిన నివేదికను కేంద్రం తమకు ఇంత వరకు పంపించ లేదన్నారు. తదుపరి అందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు వెళ్తామని, అయితే, రాష్ట్రానికి చెందిన విద్యార్థులెవ్వరూ ఉమ్మడి ప్రవేశ పరీక్షల విషయంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా