వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. ఓ స్కామ్‌

25 Jun, 2017 09:02 IST|Sakshi
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. ఓ స్కామ్‌

విదేశీ పుస్తకాల స్కానింగ్‌ పేరుతో బెంగళూరులో రూ.150 కోట్ల వంచన
సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ. లక్షల్లో వసూలు
వలలో చిక్కిన బాధితులు వందల్లోనే
పలు రాష్ట్రాల్లో ఇదే తరహాలో చీటింగ్‌  


సాక్షి, బెంగళూరు: కాసేపు స్కానింగ్‌.. ఆనక ఇంటర్నెట్‌లో పీడీఎఫ్‌ కాపీలు పంపితే లక్షల్లోనే ఆదామయంటూ మోసగాళ్లు పన్నిన వలలో చిక్కుకున్న బాధితులు మోసపోయి విలవిల్లాడుతున్నారు. బెంగళూరులో రూ. వందల కోట్లలో సాగిన ఆన్‌లైన్‌ మోసం వెలుగులోకి వచ్చింది. ఇంటి నుంచే పనిచేయండి.. కాలు కాదల్చకుండా ప్రతి నెలా వేలు, లక్షలు సంపాదించండి! ఇటీవల ఎక్కడ చూసినా ఊరించే ఇలాంటి ప్రకటనలే. బస్టాండ్లు, బహిరంగ ప్రదేశాలు, సోషల్‌ మీడియాలో ఊదరగొడుతుంటాయి. 

‘ఈ–బుక్‌’ ప్రాజెక్ట్‌ పేరుతో విదేశాలకు చెందిన పుస్తకాలను స్కానింగ్‌ చేసి పీడీఎఫ్‌లోకి మార్చి పంపిస్తే ప్రతి నెలా లక్షల్లో సంపాదించవచ్చంటూ గుజరాత్‌కు చెందిన ఓ  కంపెనీ ప్రకటనలు ఇచ్చింది. దీన్ని చూసిన బెంగళూరు విజయనగర్‌కు చెందిన వినోద్‌కుమార్‌ ఈ–బుక్‌ ప్రాజెక్ట్‌ తీసుకున్న తన స్నేహితుడి ద్వారా కంపెనీ ప్రతినిధులను సంప్రదించారు. అయితే రూ.1.50 లక్షలు  సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలని వారు చెప్పటంతో ఇంట్లో నగలు అమ్మి కట్టేశాడు. అనంతరం రూ.45,000 వెచ్చించి స్కానింగ్‌ యంత్రం కొనుగోలు చేశాడు. పుస్తకాలను స్కానింగ్‌ చేసి  పీడీఎఫ్‌లోకి మార్చి పంపించి నెలలు గడుస్తున్నా కంపెనీ పైసా కూడా ఇవ్వకపోవటంతో అనుమానంతో ఫోన్‌ చేయగా పనిచేయలేదు. దీంతో మోసపోయి నట్లు గ్రహించిన వినోద్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కంపెనీ చేతిలో ఇలా మోసపోయిన బెంగళూరుకు చెందిన 40 మంది బాధితులు కూడా విజయనగర్, విల్సన్‌గార్డెన్‌ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఒక్క కర్ణాటకలోనే ఆ కంపెనీకి వెయ్యి మందికిపైగా సభ్యులు ఉన్నట్లు గుర్తించారు. వారి దగ్గర రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశారని, ఇలా రాష్ట్రంలో రూ.150 కోట్లు గుంజినట్లు సమాచారం. గుజరాత్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో రూ.300 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

స్టార్‌హోటళ్లలో మీటింగ్‌లు, ఒప్పందాల రిజిస్ట్రేషన్లు
ఈ ముఠా మోసం చేసే తీరు పక్కాగా ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని కాలేజీలు వారి గ్రంథాలయాల్లోని పుస్తకాలను ఈ–బుక్స్‌గా మార్చడానికి నిర్ణయించుకున్నాయని, ఆ పని తమకు అప్పగించినట్లు ప్రచారం చేస్తారు. పీడీఎఫ్‌లు కంపెనీ మెయిల్‌కు పంపితే చాలంటూ అమాయకులకు వల వేస్తారు. ప్రతి పేజీకి రూ.6 వరకు చెల్లిస్తామని, ఒక్కో ప్రాజెక్ట్‌లో కనీసం 15 వేల పేజీలు ఉంటాయని, లక్షల్లో ఆదాయం వచ్చి వాలుతుందని నమ్మిస్తారు.

రకరకాల నిబంధనలు చూపి రూ.1.50 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌ రాబడతారు. కంపెనీ ప్రతినిధులంటూ హర్యానా నుంచి సూటుబూటు వేసుకుని ఖరీదైన కార్లలో వచ్చినవారితో స్టార్‌ హోటళ్లలో సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. కొందరిని  హర్యానాకు తీసుకెళ్లి అక్కడి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రాజెక్ట్‌ ఒప్పందాలను తయారు చేసి ఇస్తారు.  ఇలా వందల కోట్ల రూపాయలు వసూలు చేసి కుచ్చుటోపి పెట్టారు. కాగా, కంపెనీ ప్రతినిధులు రాఘవేంద్రసింగ్, నిఖిల్‌ ప్రకాశ్, జై మన్వాని, అనికేత్, శ్రీవాస్తవ్, దివ్యాసింగ్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు