దోమలతో జర జాగ్రత్త గురూ!

24 Apr, 2014 23:18 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రణాళికలు లేని నిర్మాణ పనులు, పరిశ్రమలు, వలసల పెరుగుదల భారతదేశ పట్టణాల్లో మలేరియా కేసులు పెరగడానికి కారణమవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన ప్రణాళికలు లేకుండా భవనాలు కట్టడం, పరిశ్రమలను స్థాపించడంవల్ల... దోమల పునరుత్పత్తికి దోహదం చేస్తోందని, అందుకే పట్టణ ప్రాంతాల్లో మలేరియా బాధితులు అధికంగా ఉంటున్నారని మలేరియా వ్యాధుల విభాగం అధినేత జీఎస్ సోనాల్ తెలిపారు. భవననిర్మాణం చేసేవాళ్లు, పారిశ్రామిక వేత్తలు చెత్తను సరైన పద్ధతిలో పారవేసినప్పుడే దోమల పునరుత్పత్తి నివారణ సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

అందుకోసం కొత్త నిర్మాణాలు చేపట్టేటప్పుడు, పరిశ్రమలు నెలకొల్పేటప్పుడు తప్పనిసరిగా ఆరోగ్యశాఖను సంప్రదించాలని ఆయన సూచించారు. మురికి లేదా నిల్వ ఉన్న నీటిలోని ఆడ ఎనాఫిలిస్ దోమ కాటువల్ల మలేరియా వస్తుందని, 2010లో భారత్‌లో 45వేల మలేరియా మరణాలు నమోదయ్యాయని సోనాల్ తెలిపారు. దేశం మొత్తంలో మలేరియా మృతుల సంఖ్య తగ్గిపోతుంటే.. పట్టణాల్లో మాత్రం మలేరియా కేసులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. దోమతెరలు ఉపయోగించడం, నిల్వ నీటిని తొలగించడం, చెత్త నిల్వ ఉండకుండా చేయడం వల్ల భారతదేశంలో మలేరియా కారణంగా సంభవిస్తున్న వేల మరణాలను తగ్గించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

 గాలిలోని వాహకాల ద్వారా వ్యాపించే డెంగీ, మలేరియా వంటి వ్యాధుల  సంఖ్య వేసవిలో పెరుగుతుందని, దోమలను బట్టి వ్యాధులు వ్యాపిస్తాయని తెలిపారు. మూతలు లేని పాత్రల్లో నీరు నిల్వచేయొద్దని, కూలర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పోయకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని, నీరు నిల్వ ఉండి ఎటూ వెళ్లడానికి మార్గంలేకపోతే.. ఆ నిల్వ నీటిపై కిరోసిన్ చల్లడంవల్ల దోమలను నివారించొచ్చని ైవె ద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇవేవి సాధ్యంకాని సమయంలో కీటక సంహారక మందులను, దోమ తెరలను వాడాలని సూచిస్తున్నారు.

దోమల నుంచి పి-వైవాక్స్, పి-ఫాల్సిపారం, పి-ఓవేల్, పి-మలేరియే అనే నాలుగు రకాల మలేరియాలు మనుషులకు వ్యాపిస్తాయని, వాటిలో మొదటి రెండు భారత ఉపఖండంలో ఎక్కువగా ఉండగా... చివరి రెండు ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు. వైవాక్స్ క్లోరోక్వినైన్‌తో వెంటనే తగ్గిపోగా... ఫాల్సిపారం అనేక సమస్యలకు కారణమవుతుందని అంటున్నారు. సరైన సమయంలో చికిత్సనందించకపోతే ఈ జ్వరం మెదడు, కిడ్నీలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు