మానవత్వానికే మచ్చ

2 May, 2017 08:48 IST|Sakshi
మానవత్వానికే మచ్చ

► అంబులెన్స్‌ ఇవ్వని ఆస్పత్రి సిబ్బంది
► బైక్‌పై బాలుని మృతదేహం తరలింపు
► ఆనేకల్‌లో దారుణ ఘటన
► ప్రభుత్వ విచారణ

బొమ్మనహళ్లి(బెంగళూరు) : మానవత్వానికి మచ్చతెచ్చే ఘటన ఇది. ఎక్కడో మారుమూల కొండకోనల్లో కూడా ఇలా జరగదేమో. కానీ మెట్రో సిటీ శివార్లలోనే చోటుచేసుకుంది. బాధితులకు ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్‌ ఇవ్వకపోవడంతో కన్నకొడుకు మృతదేహాన్ని బైకుపైన తీసుకెళ్లిన దారుణ ఘటన ఐటీ సిటీ పరిధిలో జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు మానవత్వాన్ని మరిచిపోయిన ఈ సంఘటన బెంగళూరు నగర జిల్లాలోని ఆనేకల్‌ పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది.

ఆనేకల్‌ పట్టణం సమీపంలో నివాసం ఉంటున్న అసోం నుంచి కూలి పనుల కోసం వచ్చిన దంపతుల కుమారుడు రహీం(3) తమ ఇంటి ముందు ఆదివారం సాయంత్రం ఆట ఆడుకుంటున్న సమయంలో ఒక బైక్‌ ఢీకొనడంతో తీవ్ర గాయాలైనాయి. దాంతో తల్లిదండ్రులు బాలుడిని ఆనేకల్‌ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. పరిశీలన జరిపిన వైద్యులు బాలుడు మృతి చెందాడని చెప్పడంతో బాధితులు చిన్నారి మృతదేహాన్ని తమ వెంట తీసుకునివచ్చిన బైకుపైనే వేసుకుని తిరుగుముఖం పట్టారు.

నిబంధనలు బేఖాతరు
బాలుడు మృతి చెందినప్పుడు ఆస్పత్రి వైద్యులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతోపాటు మృతదేహానికి శవపరీక్షలు పోస్టమార్టం జరిపి అప్పగించాల్సి ఉంటుంది. కానీ వైద్యులు ఇవేం పట్టించుకోలేదు. బాలుని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఆస్పత్రి వద్దనున్న అంబులెన్స్‌ను కూడా ఇవ్వలేదని చిన్నారి తండ్రి రహీం తెలిపారు.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న అత్యాచారాల నిరోధక సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వి.ఎస్‌. ఉగ్రప్ప సోమవారం బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుఉన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉగ్రప్ప తెలిపారు. ఆయనతో పాటు మాజీ మంత్రి మోటమ్మ, రాణిసతీష్, బెంగళూరు గ్రామీన ఎస్‌పీ. అమిత్‌ సింగ్ ఉన్నారు.
 

మరిన్ని వార్తలు