క్షణాల్లో మత్తెక్కించే డ్రగ్ మాయలో యువత

1 Apr, 2017 21:26 IST|Sakshi
క్షణాల్లో మత్తెక్కించే డ్రగ్ మాయలో యువత
► మయన్మార్‌ టు బెంగళూరు
►  ప్రమాదకర డ్రగ్‌ రవాణా, విక్రయాలు
► క్షణాల్లో మత్తులోకి దించే రసాయనం
► రేవ్‌ పార్టీలు, హుక్కా సెంటర్‌లలో హల్‌చల్‌
► యువతపై డ్రగ్‌ మాఫియా కన్ను
 
సాక్షి, బెంగళూరు: గంజాయి, హఫీం, చరస్‌ వంటి మత్తు పదార్థాలు బెంగళూరు యువతను తమకు బానిస చేసుకుంటుండగా, మరో మత్తుపదార్థం ఆ జాబితాలోవచ్చి చేరింది. దాని పేరే 'యాబ' రేవ్‌ పార్టీలు, హుక్కా సెంటర్‌లలో యువత ఎక్కువగా ఈ డ్రగ్‌ను వాడుతోంది. 
 
ఇటీవల బెంగళూరు పోలీసులు నిర్వహించిన సోదాల్లో ఇద్దరు బంగ్లాదేశ్‌, ఇద్దరు నేపాలీలను అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి యాబ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ డ్రగ్‌ ఎక్కడి నుంచి వస్తోంది. నగరంలో ఈ డ్రగ్‌ మాఫియా ఎంత వరకు విస్తరించి ఉందన్న విషయాలపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. నగరంలోని యువత పెద్ద సంఖ్యలో ఈ డ్రగ్‌కు బానిసగా మారుతోందన్న విషయాన్ని సైతం పోలీసులు గుర్తించారు.
 
ఉద్యాననగరికి ఇలా వస్తోంది
చాలా ప్రమాదకరమైన ఈ యాబ డ్రగ్‌ మయన్మార్‌లో తయారవుతోంది. మాత్రల రూపంలో ఉండే యాబ అమ్మకాలపై మయన్మార్‌లో నిషేధం అమల్లో ఉంది. ఇది మయన్మార్‌ నుంచి మొదట బంగ్లాదేశ్‌కు చేరుతుంది. అక్కడి నుంచి కోల్‌కతా, ఒడిశాల మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు, ఆ తర్వాత కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఈ డ్రగ్‌ రవాణా అవుతోంది. అంతేకాక కోల్‌కతా–బెంగళూరు హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైల్లో నిత్యం డ్రగ్‌ అక్రమ రవాణా అవుతోందని పోలీసులు గుర్తించారు. 
 
ఒక మిల్లీగ్రాము మోతాదులో ఉండే 'యాబ' మాత్రలు చాలా చిన్నవిగా ఉండడం వల్ల వీటిని రకరకాల వస్తువల్లో అమర్చి సులభంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం. భారత్‌ మాత్రమే కాక మధ్యప్రాచ్చ దేశాలకు సైతం డ్రగ్‌ను మత్తు పదార్థాల మాఫియా అక్రమంగా రవాణా చేస్తోంది. ఎయిర్‌ కొరియర్‌ ద్వారా పంపిస్తున్నట్లు సమాచారం.
 
ఏమిటీ యాబ?
మత్తు పదార్థాలైన మెటాంఫెటమైన్, కెఫీన్‌లను కలిపి యాబ డ్రగ్‌ను తయారు చేస్తారు. పింక్, ఆరెంజ్, గ్రీన్‌ రంగుల్లో ఉంటుంది. డబ్ల్యూవై అనే కోడ్‌ను డ్రగ్‌ మాఫియా వాడుతుంటుంది. అంతేకాక క్రేజి మెడిసిన్‌ భూల్‌ భులయ్యా పేరిట కూడా ఈ డ్రగ్‌ను పిలుస్తుంటారు. దీనిని తీసుకున్న క్షణాల్లోనే విపరీతమైన నిషా ఎక్కుతుంది. శరీరం, మనస్సుపై పూర్తిగా స్వాధీనాన్ని కోల్పోతారు. ఆ సమయంలో వారు ఎలాంటి అఘాయిత్యానికైనా ఒడిగడతారనేది మానసిక వైద్యులు చెబుతున్న మాట.
 
ఆరోగ్యానికి పెనుముప్పు
ఈ డ్రగ్‌ను తీసుకోవడం వల్ల నరాల బలహీనత, గుండెపోటు, అధిక రక్తపోటుతో పాటు మతిమరుపు వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. స్టూడెంట్, బిజినెస్‌ వీసాల పై భారత్‌కు వచ్చి అక్రమంగా నగరంలో నివసిస్తున్న నైజీరియన్‌లు ఎక్కువగా ఈ డ్రగ్‌ను ఉపయోగించడంతో పాటు నగరంలోని యువతకు సైతం ఈ డ్రగ్‌ నిషాను అలవాటు చేస్తున్నారు.
 
అడ్డుకట్టకు చర్యలు
సింథటిక్‌ రసాయనాలతో తయారయ్యే ‘యాబ’ డ్రగ్‌ నగరంలోని అక్రమంగా రవాణా అవుతోంది. దీనిని పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఈ మాఫియాకు చెందిన ఒక బృందాన్ని అరెస్ట్‌ చేసి, వీరి మూలాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం.     -ఎస్‌.రవి, అదనపు పోలీస్‌ కమిషనర్‌
మరిన్ని వార్తలు