ఘనంగా జంద్యాలధారణ

22 Aug, 2013 00:06 IST|Sakshi

సాక్షి, ముంబై: నగరం, శివారు ప్రాంతాల్లోని వివిధ తెలుగు సంఘాలలో మంగళవారం రక్షాబంధన్ జంద్యాలధారణ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు.
 
 శ్రీ రామ బాలసంఘం ఆధ్వర్యంలో..
 వర్లీ బీడీడీ చాల్ 106/45 సంఘం ఆధ్వర్యంలో జంద్యాల వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు ఇట్టె మురళి, ఉపాధ్యక్షులు తాటిపాముల గంగాధర్, ప్రధాన కార్యదర్శి సామల్ల శ్రీహరి, ఉపకార్యదర్శి అనుమల్ల శ్రీనివాస్, కోశాధికారి చింతకింది శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
 శ్రీ పద్మశాలి తెలుగు సంఘం ఆధ్వర్యంలో..
 గాయత్రిధారణ మహోత్సవ సందర్భంగా సైన్-కోలివాడలోని శ్రీ పద్మశాలి తెలుగు సంఘం నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా కుడిక్యాల్ బాలకిషన్, ఉపాధ్యక్షుడిగా దుస్స శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా జోరీగల సింద్రాంలు, సహాయ కార్యదర్శిగా చిలివేరి మహేంద్ర, కోశాధికారిగా పారెల్లి రాజ్‌మహేంద్ర, సహాయ కోశాధికారిగా కస్తూరి గణేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పద్మశాలి యువక సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీ అనుమల్ల సుభాష్, దోమల శంకర్ తదితరులు నూతన కార్యవర్గ సభ్యులను సత్కరించారు.
 
 భివండీలో ...
 భివండీ, న్యూస్‌లైన్: భివండీలో తెలుగు ప్రజలు జంద్యాల పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా అఖిల పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో సాయంత్రం వివిధ ప్రాంతాల్లో మార్కండేయ పల్లకి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొనడంతో తెలుగుతనం ఉట్టిపడింది. రాత్రి వరకు సాగిన పల్లకి యాత్ర ఉత్సవాలు పండుగ శోభను తెచ్చాయి. స్థానిక పోలీసుశాఖ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించింది. పద్మనగర్‌లో అఖిల పద్మశాలి సమాజ మంగళ కార్యాలయంలో సమాజ పెద్దలు జంద్యాల పండుగను ఘనంగా నిర్వహించారు. పద్మనగర్‌లోని నీలకంఠేశ్వర్ మందిరం నుంచి మగ్గం ద్వారా నూలు బట్ట నేస్తూ పల్లకి శోభాయాత్ర నిర్వహించారు. బాజీ మార్కెట్, కన్నేరి, కుంబార్‌వాడ, తీన్ బత్తి ప్రాంతాల మీదుగా కాసర్ అలీలోని మార్కండేయ మహాముని మందిరానికి చేరుకుంది. యాత్రకు కన్నేరిలో తెలుగు యువక్ మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. నేసిన వస్త్రాన్ని మార్కండేయుడికి సమర్పించిన తర్వాత దానిని వేలం వేశారు. ఈ ఏడాది కామత్‌ఘర్ చందన్‌భాగ్ ప్రాంతానికి చెందిన భివండీ తెలుగు సమాజ్ అధ్యక్షుడు తుమ్మ రమేశ్ దాన్ని రూ.2.05 లక్షలకు పొందారు. సమాజం పెద్దలు దాసి అంబాదాస్, వేముల నర్సయ్య, పాశికంటి లచ్చయ్య, వంగ పురుషోత్తంలు రమేశ్‌కు వస్త్రాన్ని అందజేశారు.
 
 కాసర్ అలీలోని మార్కండేయ మందిరాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉదయం నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మశాలి సమాజ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు లక్ష్మణ్ గోస్కే ఇతర సభ్యులు సాయంత్రం మందిరం నుంచి పల్లకి యాత్ర నిర్వహించారు. కామత్‌ఘర్‌లో శ్రీ శివభక్త మార్కండేయ మందిరంలో ప్రతి యేడాది మాదిరిగానే సుప్రభాత, నిత్య పూజలు, ద్వజారోహణ, గాయత్రి మహా యజ్ఞం, అభిషేఖాలు, అర్చనలు, యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మగ్గం ద్వారా నూలు బట్టను నేస్తూ కామత్‌ఘర్ పుర:వీధుల మీదుగా ఊరేగింపు నిర్వహిం చారు. ఆ నూలు బట్టను స్వామి వారికి సమర్పిం చారు. అనంతరం దానిని వేలం వేయగా మంగళంపల్లి రవి రూ.11,100 లు చెల్లించి సొంతం చేసుకున్నారు.
 
 తడాలిలో...అఖిల పద్మశాలి సమాజ్ కామత్‌ఘర్ శాఖ  ఆధ్వర్యంలో హనుమాన్ మందిరం నుంచి వేషధారణలతో భక్తులు ఊరేగింపును నిర్వహించారు. పాంజలాపూర్, కోంబడ్‌పాడ, సంగమ్ పాడా, పద్మశాలి యువక మండలి శాఖలు కూడా పల్లకి ఊరేగింపు నిర్వహించాయి. కార్పొరేటర్ మచ్చ మురళి కార్యాలయంలో మార్కండేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా వరాలదేవి రోడ్డులోని శ్రీ మార్కండేయ మహాముని వాచనాలయ సమితి ఆధ్వర్యంలో మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతిథులుగా కార్పొరేటర్లు సంతోష్ శెట్టి, శశిలత శెట్టి హాజరయ్యారు. సాయంత్రం పల్లకి యాత్ర నిర్వహించినట్లు సమితి అధ్యక్షుడు సిరిపురం తిరుపతి, కార్యదర్శి శంకర్ వడిగొప్పుల తెలిపారు.

మరిన్ని వార్తలు