యశస్విని విస్తరణ

29 Sep, 2013 03:45 IST|Sakshi

సాక్షి,బెంగళూరు : రాష్ట్రంలో గుర్తింపు పొందిన సహకార సంఘాల్లోని సభ్యులకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించే ‘యశస్విని’ పథకం పరిధిని విస్తరింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన వెలువరించింది. ఇకపై యశస్విని పథకం పరిధిలోకి గుండె, వెన్ను, కీళ్ల శస్త్ర చికిత్సలనూ చేర్చుతున్నట్లు అందులో పేర్కొంది. అంతేకాకుండా కేన్సర్‌కు రేడియేషన్ థెరపీనీ చేర్చింది. దీని వల్ల ఇకపై బ్రెస్ట్, గర్భకోశం, సెర్విక్స్, ఆహారనాళం, రిక్టల్, ప్రోటెస్ట్ కేన్సర్లకు రేడియేషన్ థెరపీను పొందడానికి వీలవుతుంది.

అదేవిధంగా గర్భిణి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ సోకకుండా నిరోధించడానికి అందించే ప్రివెన్షన్ ఆఫ్ పేరెంట్ టూ చైల్డ్ ట్రాన్స్‌మిషన్ (పీపీటీసీటీ)...హెచ్‌ఐవీ సోకిన మహిళకు అందించే లోయర్ సెగ్మెంట్ కేసెరీయన్ సెక్షన్ (ఎల్‌ఎస్‌పీఎస్) చికిత్సను కొత్తగా యశ స్విని పరిధిలోకి చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సదుపాయం అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది.

ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 30.36 లక్షల మంది సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుత ప్రభుత్వం 13 విభాగాల్లో 805 రకాల శస్త్రచికిత్సలను ఈ పథకం కింద సర్కార్ అందిస్తోంది. కాగా, 2012-13 ఏడాదిలో యశస్విని పథకం కింద 1.10 లక్షల మంది ఔట్‌పేషంట్లకు చికిత్స అందించగా, 83,802 మందికి వివిధ రకాల శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 492 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందడానికి అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు