ఏడాదిలో నాలుగు సార్లే ఎన్నికలు!

10 Feb, 2015 22:43 IST|Sakshi

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సహారియా ప్రతిపాదన
సాక్షి, ముంబై: స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను సంవత్సరంలో కేవలం నాలుగు సార్లే నిర్వహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జేఎస్ సహారియా పేర్కొన్నారు. దీనిపై తాను సోమవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చించినట్టు తెలిపారు. ఎన్నికలలో మరింత పారదర్శకతను తేవడంతోపాటు ఇబ్బందులు లేకుండా సులభంగా పోలింగ్ నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చలు జరిపినట్టు చెప్పారు. ప్రస్తుతం సంవత్సరం పొడవున ఎక్కడో ఓ చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో సంవత్సరంలో నాలుగుసార్లే ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు సహారియా తెలిపారు. ఎన్నికల ప్రక్రియ కోసం జిల్లా, తాలూకాల వారిగా శాశ్వతంగా ఎన్నికల సిబ్బందిని ఎంపిక చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు పలుమార్లు ఎన్నికల కమిషన్‌తో సంబంధం లేకుండా ఎన్నికల అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం బదిలీ చేస్తోంది. అలా జరగకుండా ఎన్నికల కమిషన్‌తో చర్చించిన అనంతరమే ఎంపిక, బదిలీలు చేయాలని సూచించారు. అదే విధంగా ఎన్నికల ప్రక్రియను పూర్తిగా కంప్యూటరీకరణ చేయాలని కోరినట్టు చెప్పారు. లోకసభ, అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే స్థానిక సంస్థలు, గ్రామపంచాయితీ ఎన్నికల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సహారియా ఈ సందర్బంగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేసినట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు