ప్రశాంతంగా పోలింగ్

5 Dec, 2013 02:23 IST|Sakshi
సాక్షి, చెన్నై: నిఘా నీడలో ఏర్కాడు ఉప సమరం బుధవారం ప్రశాంతం గా ముగిసింది. రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావడంతో గెలుపుపై ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పెరుమాళ్ మరణంతో ఏర్కాడు రిజర్వుడు స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక లోక్ సభ ఎన్నికలకు రెఫరెండంగా డీఎంకే, అన్నాడీఎంకేలు పరిగణించాయి. డీఎంకే అభ్యర్థి మారన్, అన్నాడీఎంకే అభ్యర్థి సరోజతోపాటుగా మరో తొమ్మిది మంది ఇండిపెండెంట్లు ఎన్నికల రేసులో నిలబడటంతో సమరం ఆసక్తికరంగా మారింది.
 
 ప్రధాన పక్షాల మధ్య గట్టి పోటీ ఉన్నా, ఓట్ల చీలిక ఎక్కడ గండి కొడుతుందేమోనన్న బెంగ మొదలైంది.ప్రశాంతంగా ఓటింగ్: నియోజకవర్గం పరిధిలోని 290 పోలింగ్ కేంద్రాల్లో చెదురుమదురు ఘటనల మినహా బుధవారం ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. 2500 మంది పారా మిలటరీ బలగాలు, స్థానిక పోలీసుల సహకారంతో గట్టి భద్రత మధ్య ఉదయం ఎన్నికలు జరిగింది. 41 పోలింగ్ కేంద్రాలు అటవీ గ్రామాల్లో ఉండటం, మరో 21 కేంద్రాలు కొండ ప్రదేశాల్లో ఉండటంతో అటు అధికారులు, ఇటు భద్రతా సిబ్బంది నానాతంటాలు పడాల్సి వచ్చింది. 
 
 ఉదయం ఏడున్నర గంటలకే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నానికి అనేక కేంద్రాల్లో 75 శాతం మేరకు ఓటింగ్ జరిగింది. ఏర్కాడు పరిసరాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం ఐదు గంటలైనా, ఓటర్లు బారులు తీరే ఉన్నారు. దీంతో వారికి టోకెన్లను అందజేసి ఓట్లు వేసే అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో తొలి సారిగా నోటా బటన్ ఉపయోగించారు. ఓటింగ్ సరళిని అన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వెబ్ కెమెరాల ద్వారా ఆన్‌లైన్‌లో సేలం జిల్లా కలెక్టర్ మకర భూషణం, చెన్నైలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ పర్యవేక్షించారు. సాయంత్రానికి ఇది వరకు ఎన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు అయింది. పోలింగ్ 89.75 నమోదైనట్టు అధికారులు ప్రకటించారు.
 
 గెలుపుపై ఎవరి ధీమా వారిది: ఓటింగ్ ముగియడంతో గెలుపుపై అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థుల్లో ధీమా పెరిగింది. అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ ఉదయం తన భర్త పెరుమాళ్ సమాధి వద్ద నివాళులర్పించినానంతరం ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన స్వగ్రామం వాల్పాడి సమీపంలోని పాప్పనాయకన్ పట్టి పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో తాను గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే అభ్యర్థి మారన్ తన స్వగ్రామం పూవలూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాను 25 వేల ఓట్ల మెజారిటీతో గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. 
మరిన్ని వార్తలు