అత్యున్నత దర్యాప్తు అవసరం లేదు

8 Nov, 2016 03:14 IST|Sakshi

ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల హత్యలపై సీఎం సిద్దు

మైసూరు:  ఇటీవల దారుణహత్యకు గురైన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు రుద్రేశ్, మాగళి రవిల హత్య కేసులపై దర్యాప్తును సీబీఐ, ఎన్‌ఐఏలకు అప్పగించేది లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. సోమవారం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి నగరానికి చేరుకున్న ఆయన మండకళ్లి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ...గతంలో కూడా ఇటువంటి హత్యలపై విచారణను సీబీకి అప్పగించగా ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు రుద్రేశ్, మాగళి రవిల హత్యల కేసులను రాష్ట్ర పోలీసులే దర్యాప్తు చేస్తారని తెలిపారు. బెంగళూరులో హత్యకు గురైన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రుద్రేశ్ హత్య వెనుక మంత్రి రోషన్‌బేగ్ హస్తముందంటూ బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని తెలిపారు.

బెళగావిలో త్వరలో జరుగనున్న శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి  ప్రభుత్వం  అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని తెలిపారు. బీజేపీ తన రాజకీయ లబ్ది కోసం టిప్పు జయంతిని వ్యతిరేకిస్తూ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. టిప్పు చరిత్రను వక్రీకరిస్తూ బీజేపీ ప్రజలకు తప్పు దోవ పట్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వివాహ వేడుకల్లో అధిక ఖర్చుకు తాను వ్యతిరేకమని,  ఈ విషయంపై ప్రత్యేక చట్టం తేవడానికి విధానసభలో చర్చించనున్నామని తెలిపారు. మాజీ మంత్రి వీ.శ్రీనివాస్ ప్రసాద్ రాజీనామా అనంతరం నం జనగూడుకు జరుగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థిని ఇంకా ఎంపిక చేయలేదని తెలిపారు. కార్యక్రమంలో విధానపరిషత్ సభ్యుడు ధర్మసేనా, కాంగ్రెస్ జిల్లాధ్యక్షుడు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు