యువతలో కిడ్నీ సమస్యలు

13 Mar, 2015 23:11 IST|Sakshi

గణనీయంగా పెరుగుతున్న రోగుల సంఖ్య
- ప్రతి పదిమందిలో ఒకరు సమస్యతో సతమతం
- జీవనశైలిలో మార్పే కారణమంటున్న వైద్యులు
సాక్షి, ముంబై: మారుతున్న జీవన విధానం, చెడు వ్యసనాల వల్ల నేటి యువతరానికి మధుమేహం, రక్తపోటు, ప్రాణాంతకమైన కిడ్ని వ్యాధులు అధికమవుతున్నాయి. ముఖ్యంగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతీ 10 మందిలో ఒకరు కిడ్ని సమస్యతో బాధపడుతున్నారు.

నేటి యువతరం జీవన శైలి మార్చుకోని పక్షంలో 2020 నాటికి ప్రతీ ఏడుగురు యువకుల్లో ఒకరు కిడ్నీ వ్యాధి బారినపడే ప్రమాదముందని ప్రముఖ నెఫ్రోలజిస్ట్ డాక్టర్ జోత్సనా జోపే తెలిపారు. మనుషుల్లో వివిధ శరీర భాగాలతో పోలిస్తే కిడ్ని ప్రధాన పాత్ర పోషిస్తుందని, అనేక మందికి కిడ్ని 85-90 శాతం పాడైపోయిన తర్వాత ఇబ్బందులు మొదలవుతాయని, దీంతో డయాలసిస్‌పై ఆధారపడాల్సి వస్తోందని జోపే అన్నారు.
 
ప్రతి ఏడాది రెండు లక్షల కొత్త రోగులు
దేశంలో ప్రతి ఏడాది రెండు లక్షల కొత్త రోగులకు డయాలిసిస్ చికిత్స అవసరం అవుతోందన్నారు. కిడ్నీ సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణాలు తినే ఆహారంలో వస్తున్న మార్పులేనని, దీని ప్రభావం కిడ్నీపై పడుతోందని జోత్సనా అన్నారు. నేటి యువత పాఠశాల, కళాశాల, ఉద్యోగాలకు వెళ్లే సమయంలో రహదారులపై విక్రయించే తినుబండారాలు, ఫుడ్ సెంటర్లలో లభించే పిజ్జాలు, బర్గర్లు, రకరకాల వెజ్, నాన్ వెజ్ రోల్స్ ఆరగిస్తుంటారు.

నగర వాతావరణం రోజురోజుకూ కలుషితమవుతోందని, దీని ప్రభావం నేరుగా ఆరోగ్యంపై పడుతోందని జోత్సనా అన్నారు. దీంతో కిడ్నీతో బాధ పడేవారికి డయాలసిస్ కేంద్రాలు సరిపోవడం లేదని ఆమె వెల్లడించారు. కాగా, పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా డయాలలిస్ యంత్రాలు అందుబాటులో లేవు. ప్రధాన నగరాల్లో మాత్రమే ఈ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ముంబైలో 200 డయాలసిస్ కేంద్రాలుండగా అందులో 700 యంత్రాలున్నాయి. ప్రతిరోజు సుమారు నాలుగు వేల రోగులు కేంద్రాలకు క్యూ కడుతుంటారు.

మరిన్ని వార్తలు