ఆప్యాయతకు రారాజు 'విలువలకు చక్రవర్తి'

2 Sep, 2018 11:10 IST|Sakshi

ముఖ్యమంత్రి అయినా  స్నేహానికి ప్రాణం  

 ఎప్పుడు వెళ్లినా  ఆత్మీయ పలకరింపు  

 గుర్తుచేసుకున్న  మహానేత స్నేహితులు  

 డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి  కన్నడనాడుతో మైత్రి  

 బళ్లారితో ప్రగాఢ అనుబంధం

డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి... ఈ పేరు వినగానే కోట్లాది హృదయాలు ఆనందంతో పులకిస్తాయి. మల్లెపువ్వును మరిపించే చిరునవ్వు, ఆప్యాయతలు మదిమదిలో ముప్పిరిగొంటాయి. ఆ మహానేత మహాభినిష్క్రమణం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. అయినా ఆయన జ్ఞాపకాలు శాశ్వతం, సజీవం. ఇది ఆయన మిత్రులు, కోట్లాది అభిమానులు చెప్పే మాట. నేడు ఆదివారం డాక్టర్‌ వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా కన్నడనాడు, బళ్లారితో ఆయనకు ఉన్న అనుబంధం, స్నేహితుల మనసులోని మాటలు తెలుసుకుందాం. 

సాక్షి, బళ్లారి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన అపారమైన ప్రజాకర్షక బలంతో, ప్రజా సంక్షేమ పథకాలతో రెండుసార్లు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులు ఎలా ఉన్నారో, కన్నడనాట కూడా ప్రజలపై వైఎస్సార్‌ చెరగని ముద్ర ఉంది. ముఖ్యంగా బళ్లారి జిల్లాతో వైఎస్సార్‌కు విడదీయలేనంత అనుబంధం ఉంది. ఆయన 7వ తరగతి నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌సీతో పాటు డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ అంటే బళ్లారిలో ఆరు సంవత్సరాలు పాటు విద్యాభ్యాసం చేశారు.  

డిగ్రీ బళ్లారి నగరంలోని వీరశైవ కాలేజీలో చదువుతుండగానే గుల్బర్గా కాలేజీలో ఎంబీబీఎస్‌ సీటు వచ్చింది. ఎంబీబీఎస్‌ కూడా కర్ణాటకలో పూర్తి చేయడంతో ఆయన విద్యాభ్యాసం దాదాపు కర్ణాటకలోనే అధికభాగం కొనసాగింది. బాల్యం, కాలేజీ రోజులను ఎవరూ మరువలేరు, ఆ స్నేహితులను కూడా మరచిపోలేరు. మహానేత వైఎస్సార్‌ కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా చిన్ననాటి మిత్రులను, చదివిన పాఠశాలను ఎప్పుడు నెమరవేసుకునేవారట. నూనూగుమీసాల వయసులోనే శాసనసభ్యునిగా గెలిచి స్వశక్తితో ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సంక్షేమ పథకాలు చేపట్టి, సంక్షేమ పథకాలు రథసారథిగా పేరు తెచ్చుకున్నారని బళ్లారిలోని ఆయన మిత్రులు నిరంతరం గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో బళ్లారిలోని వైఎస్సార్‌ క్లాస్‌మీట్స్, స్నేహితులు సాక్షితో తన అపురూప స్నేహాన్ని మననం చేసుకున్నారు.  

మంచికి నిదర్శనం వైఎస్సార్‌  
► మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మా స్నేహితుడు, క్లాస్‌మీట్‌ కావడమే తమ అదృష్టంగా భావిస్తున్నాం.ఆయన ఆరవ తరగతి నుంచి తాము కలిసి, మెలసి ఉండేవాళ్లం. బళ్లారి నగరంలోని ఆయన ఆరవ తరగతి చేరినప్పుడు నగరంలో సెయింట్‌జాన్స్‌ హాస్టల్‌లో ఉండేవారు. బళ్లారిలో వైఎస్సార్‌ తండ్రిగారు రాజారెడ్డి కాంట్రాక్టు పనులు నిర్వహించేవారు. రాజారెడ్డి వైఎస్సార్‌తో పాటు వైఎస్‌ తోబుట్టువులు వైఎస్‌ జార్జిరెడ్డి, వైఎస్‌ వివేకానందరెడ్డి, సోదరి విమలను కూడా బళ్లారిలోనే చదివించారు.  

► బళ్లారిలో రాజారెడ్డి ఇల్లు తీసుకోకముందు సెయింట్‌జాన్స్‌ హాస్టల్స్‌లో చేర్పించారు. మేము, వైఎస్సార్‌తో పాటు హాస్టల్‌లో ఒకే గదిలో ఉంటూ తరగతిలో పక్కన, పక్కనే ఉంటూ చదువుకున్నాం. హాస్టల్‌లో 50 మంది విద్యార్థులు ఉండేవాళ్లం. వైఎస్సార్‌ అందరితోనే కలిసి, మెలసి ఉండేవారు. ప్రతి ఒక్కరిని పేరుతో పలకరిస్తూ, పెద్దవారిని అన్నా అంటూ మాట్లాడేవారు. 

►  పుస్తకాలు విషయం వస్తే ఆయన ఎంతో నీట్‌గా పెట్టుకునేవారు. ఒక్క కాగితం కూడా చినిగిపోకుండా చూసేవారు. తను ఏడాది పాటు చదివిన తర్వాత వాటిని జూనియర్స్‌కు ఇచ్చే మంచి మనసు ఆయనది. ఏడాది పుస్తకాలను చదివినా ఆ పుస్తకాలు ఈరోజువే అన్నంత కొత్తగా ఉండేవి.  

► హాస్టల్‌లోకు అప్పట్లోనే ఆయన అన్నదమ్ములతో కలిసి జీపులో వచ్చేవారు. అప్పట్లో వాహనాలు చాలా తక్కువగా ఉంవడటంతో తమను కూడా జీపులో రమ్మని పిలిచేవారు. హాస్టల్‌లో రెండు సంవత్సరాలు ఉన్న తర్వాత వైఎస్సార్‌ తండ్రి పిల్లలు చదువుకోసం బళ్లారిలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు.దీంతో హాస్టల్‌లో నుంచి ఇంటికి మారారు. సెయింట్‌జాన్స్‌ పాఠశాల దగ్గర్లోనే ఇల్లు తీయడంతో అక్కడ నుంచి కాలినడకన, లేదా జీపులో పాఠశాలకు చేరుకునేవారు.  

► సెయింట్‌జాన్స్‌ పాఠశాలలో అప్పట్లో రాజశేఖరరెడ్డి అంత మృదుస్వభావి, మితభాషి, హుషారుగా ఉండేవారు.  
వైఎస్సార్‌ అంటే తరగతిలో అందరూ ఇష్టపడేవాళ్లం. ఎస్‌ఎస్‌ఎల్‌సీలో మంచి పార్కులతో పాసైనారు. బళ్లారి తరువాత విజయవాడ, గుల్బర్గాలలో విద్యాభాస్యం పూర్తి చేశారు. అనంతరం ఆయన చిన్ననాటి స్నేహితుడు , మా అందరికి మిత్రుడు దివంగత లెనార్డ్‌ గోంజాల్వేజ్‌ వైఎస్సార్ను కలిసి వస్తుండేవారు.  

► వైఎస్సార్‌ రాజకీయాల్లోకి చేరిన తర్వాత అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేరుకోగారు. మేం కలవడానికి వెళ్తే ఆయన మాట్లాడిన తీరు ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. 40 సంవత్సరాలు తర్వాత వైఎస్సార్‌ను కలిస్తే ఆయన ఒక్కసారిగా తమ వద్దకు వచ్చి పేర్లు పెట్టి ఫలానా అంటూ మాట్లాడంతో మాకు ఆనంద భాష్పాలు వచ్చాయి.  

క్యాంపు ఆఫీసులో  మరచిపోలేని ఘటన  
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్‌ను హైదరా బాద్‌లో క్యాంప్‌ ఆఫీస్‌లో కలిసేందుకు వెళ్లాం. సార్‌ బిజీగా ఉ న్నారు. కలవడం ఇబ్బందిగా ఉంటుందని, అక్కడ ఉన్న పెద్ద పెద్ద వ్యక్తు లు మాతో చెప్పారు. అయితే ఎంతో కష్టంతో మా పేర్లను వైఎస్సార్‌ వద్దకు పంపించాం. ఐదు నిమిషాల్లోనే ఆయన మా వద్దకే గబగబా వచ్చి ఆప్యాయంగాపలకరించి ఆఫీసు లోపలకి తీసుకెళ్లడంతో మేమే కాదు, అక్కడున్న వారి ఆశ్చర్యానికి పట్టపగ్గాల్లేవు. సీఎం క్యాంపు ఆఫీస్‌లో కూర్చొన్న తర్వాత ప్రతి ఒక్క క్లాస్‌మీట్‌ పేరు, పేరును గుర్తు చేసుకుంటూ వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. సీఎం అయిన తర్వాత ఎప్పుడు హైదరాబాద్‌ లేక ఆయన ఎక్కడ ఉన్న తాము అక్కడికి వెళ్లితే ముందుగా మాకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చేవారు.  

స్నేహితులు అంటే ఆయనకు పంచప్రాణాలు.అపారమైన జ్ఞాపకశక్తి ఉండటంతోనే ప్రతి ఒక్కరిని పేరు పేరును పలకరించేవారు. స్కూల్లో స్నేహితులకు ఏ కష్టమెచ్చినా తనకు చెప్పాలనేవారన్నారు. సీఎం అయిన తర్వాత కూడా అవే మాటలు మాట్లాడడం చూసి మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. పువ్వుపుట్టగానే పరమళిస్తుందని విధంగా మహానేత వైఎస్సార్‌ చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు, పదిమందికి సేవచేసే గుణంగా, స్నేహానికి విలువ, నమ్మినవారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దపడే ధీరత్వం ఉండేవి.  ఆయన మరణంతో మా కుటుంబంలో ఆత్మీయుణ్ని కోల్పోయామన్న ఆవేదన బాధిస్తోంది. ఆయన భౌతికంగా లేకపోయినా మా మదిలో నిలిచిపోయారని మిత్రులు పేర్కొన్నారు. 

కలిస్తే.. చిన్ననాటి జ్ఞాపకాలే  
వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాకు డిగ్రీలో పరిచయం అయ్యా రు. బళ్లారి వీరశైవ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదివే రోజుల్లో వైఎస్సార్‌ నాతో ఎంతో స్నేహం గా మెలిగేవారు. వారి ఇంటికి వెళ్లేవాళ్లం. వైఎస్సార్‌ తండ్రి రాజారెడ్డి కూడా మమ్మల్ని ఎంతో అప్యాయం గా పలకరించేవారు. హెచ్‌ఎల్‌సీ క్వార్టర్స్‌లో ఎప్పుడు కలుసునేవాళ్లం.డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి అయిన తర్వాత ఎంబీబీఎస్‌ చదవడానికి ఆయన గుల్బర్గాకు వెళ్లారు. సీఎం అయిన తర్వాత కలిస్తే చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. వైఎ స్సార్కు ఎంతో జ్ఞాపకశక్తి ఉండేది. అర్ధరాత్రి 1 గంట వరకు పుస్తక పఠనంలో మునిగిపోయేవారు. తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లో మంచి పట్టు ఆయన సొంతం.   

మరిన్ని వార్తలు