మహానేతకు ఘన నివాళి

4 Sep, 2013 00:24 IST|Sakshi

 దాదర్, న్యూస్‌లైన్:కడదాకా ప్రజాసేవకే అంకితమై, కోట్లాది మంది తెలుగు హృదయాలలో చిరంజీవిగా నిలిచిన మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా ముంబైలోని తెలుగు ప్రజలు ఆయనకు ఘననివాళులు అర్పించారు. గోరేగావ్‌లోని వై.ఎస్.జగన్ యువజనసంఘం ఆధ్వర్యంలో చంద్రమణి బుద్ధవిహార్ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ సమావేశంలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్‌పార్టీ మహారాష్ట్రశాఖ అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కళాకారుడు మిమిక్రీ రమేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రెడ్డితోపాటు పలువురు స్థానిక తెలుగు ప్రముఖులు వై.ఎస్‌కు నివాళులు అర్పించారు.
 
 ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. వైఎస్సార్ సామాన్య ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, పల్లెపల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చేసిన కృషి, అభివృద్ధిని స్మరించుకున్నారు. రాజన్న ప్రస్తుతం మన మధ్య లేకపోయినా, అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని కొండారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో అటువంటి జననేత మళ్లీ పుడతాడో లేదో అంటూ తన ఆవేదన వ్యక్తం జేశారు. అలాగే తండ్రిని మించిన తనయుడిగా ప్రజాభిమానం పొందిన జగన్మోహన్‌రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే జైలు నుంచి బయటికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తొలుత స్థానిక గాయకుడు గాజుల నరసారెడ్డి మహానేతను స్మరిస్తూ పాడిన గేయం ‘పల్లెలన్నీ అడుగు ఉతున్నాయి.. మా రాజన్న ఏడనీ.. దిక్కులన్నీ.. వెదుకుతున్నాయి.. మా రాజన్న ఏడని’ అందరినీ కదిలించింది.
 
 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. వ్యాఖ్యాతగా వచ్చేసిన మిమిక్రీ రమేష్.. ‘పెద్దాయనా! పెద్దాయనా! ఇది స్వార్ధపు లోకం.. పెద్దాయనా!’  అని పాడుతూ వైఎస్సార్ జీవిత విశేషాలను వివరించారు. ముంబై తెలుగు పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్, ఆల్ ముంబై తెలుగు క్రిస్టియన్ చర్చెస్ అండ్ లీడర్స్ తరఫున రెవరెండ్ జంగిల బాబ్జీ రాజన్న స్మృతితో ప్రార్థన చేశారు. అలాగే జగన్ కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక తెలుగు ప్రముఖులు మర్రి జనార్దన్, సంగెవేని రవీంద్ర, మంతెన రమేష్, బి.వి.రెడ్డి, మన్మథరావు, బి.వి.రాజు, రాజ్ కుమార్, బి.జే.రావు,
 
 బద్దా బాలరాజు, మేకల హన్మంతు, డి.భాస్కర్ రావు, వి.వెంకటేశ్వర్‌రెడ్డి, వి.వి.రమణారెడ్డి, జి.సుబ్బారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మోరా తిరుపతిరెడ్డి, వీరారెడ్డి, శ్రీనురెడ్డి, వై.ఎస్.జగన్ యువజన సంఘం సభ్యులు ఎం.రామకృష్ణ, ఎస్.సురేష్, కె.కుమార్, బి.విజయ్, ఎన్.ప్రవీణ్, శ్రీనివాస్ తదితరులు వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి మాదిరెడ్డి కొండారెడ్డి స్కూలు విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. మిమిక్రీ రమేష్ మహానేతను ఉద్దేశించి ‘మీరు నడిస్తే మీ వెంటే నడిచాయి మేఘాలు- మీరు నవ్వితే మీ కోసమే నవ్వాయి పంటచేలు.. రాజశేఖరా.. మళ్లీ జన్మించవా.. మా కోసం’ వంటి పాటలతో సభా ప్రాంగణం మార్మోగింది.
 

మరిన్ని వార్తలు