నిరుద్యోగ భృతంతా లోకేశ్‌కేనా?!

19 Oct, 2016 01:29 IST|Sakshi
నిరుద్యోగ భృతంతా లోకేశ్‌కేనా?!

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజం

 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నారు, నిరుద్యోగుల్ని ఆదుకోకుండా మోసగించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల సమయంలో ఊదరగొట్టి ఓట్లు దండుకున్న బాబు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆమె మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం రెండేళ్లకు పైగా అధికారంలో ఉండి ఏం వెలగబెట్టిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు కొత్త సచివాలయంలో కార్యాలయాన్ని ప్రారంభిస్తూనే నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదంటూ యువత నోట్లో మట్టి కొట్టారని పద్మ మండిపడ్డారు. గత 29 నెలలుగా నిరుద్యోగ భృతి చెల్లించకుండా మిగిల్చిన రూ.1.15 లక్షల కోట్లు ఏమైపోయాయి? ఎవరు తిన్నారు? అని నిలదీశారు. ఈ మొత్తాన్ని తక్షణం నిరుద్యోగుల కుటుంబాలకు ఇంటికి రూ.58 వేల చొప్పున పంచి పెట్టాలని డిమాండ్ చేశారు.

 దమ్ముంటే లోకేశ్‌ను ప్రజాక్షేత్రంలోకి పంపండి
 ‘‘రాష్ట్రంలో నిరుద్యోగులకు దక్కాల్సిన భృతిని బాబు మూటలు కట్టి తన కుమారుడు లోకేశ్‌కు దోచిపెడుతున్నారు. కేవలం లోకేశ్‌కే దీపావళి ధమాకా కట్టబెట్టడానికి సీఎం ప్రయత్నిస్తున్నారు. తన కుమారుడిని దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవి ఇద్దామనుకుంటున్నారు. దమ్ముంటే కుమారుడిని ప్రజాక్షేత్రంలోకి పంపాలి. ఎన్నికల హామీలపై ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయంతో మేనిఫెస్టోలను కూడా టీడీపీ వెబ్‌సైట్ నుంచి మాయం చేశారు. వాటిని త్రీడీ యాంగిల్‌లో ప్రజలకు చూపిస్తాం’’ అని పద్మ తేల్చిచెప్పారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన యువభేరిలో యువత స్పందిస్తున్న తీరు చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనపైన వారు ఎంత అసహనంతో ఉన్నారో తెలుస్తోందన్నారు.

మరిన్ని వార్తలు