పట్టిసీమ పేరుతో కృష్ణాడెల్టా నాశనం చేయెద్దు

23 Aug, 2016 17:48 IST|Sakshi

-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్.నాగిరెడ్డి

తెనాలి

పట్టిసీమ పేరుతో కృష్ణాడెల్టాను నాశనం చేయొద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రథమ వినియోగ హక్కు, నికర జలాల హక్కు కలిగిన కృష్ణాడెల్టాకు పట్టిసీమ పేరుతో నీటి కేటాయింపులపై అయోమయ పరిస్థితిని కల్పించవద్దన్నారు. చిత్తశుద్ధి వుంటే కృష్ణాబోర్డు నుంచి ఏ మేరకు నీటిని తీసుకొంటారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. వేమూరు నియోజకవర్గంలో సాగునీరందక దెబ్బతిన్న వరిసాగు పొలాలను మంగళవారం నాగిరెడ్డి పరిశీలించారు.

అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో సాగుభూమి 43 లక్షల హెక్టార్ల నుంచి 40.9 లక్షల హెక్టార్లకు పడిపోయిందన్నారు. తెలంగాణలో సాగుభూమి 38.58 లక్షల హెక్టార్ల నుంచి 43 లక్షల హెక్టార్లకు విస్తరించిందని చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్‌లో ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో పంటల సాగు 69 శాతం కాగా, గుంటూరు జిల్లాలో 59 శాతం మాత్రమేనని చె ప్పారు. ఇదే జిల్లాలో 1.89 లక్షల హెక్టార్లకు 76 శాతమే సాగు చేయగలిగినట్టు నాగిరెడ్డి వివరించారు. ఏరువాక పేరుతో పండుగలు చేసిన ప్రభుత్వం, జులై 10వ తేదీనుంచి నారుమళ్లు పోసుకోవచ్చని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణాడెల్టా రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని నాగిరెడ్డి ఆరోపించారు.

పట్టిసీమ నీటిని నెల్లూరు, పెన్నావరకు తీసుకెళతామని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం కృష్ణాడెల్టాలో నారుమళ్లకు కూడా ఇవ్వలేకపోయినట్టు చెప్పారు. వెదజల్లిన చేలల్లో పంటలు ఎండిపోతున్నా, పుష్కరాల కోసమని అక్కడే వుంటున్న ముఖ్యమంత్రి పట్టించుకోలేదనీ, సుభిక్షమైన కృష్ణాడెల్టాను బీడుగా మార్చారని ఆరోపించారు. పంటకాలువల నుంచి ఇంజిన్లతో బ్రాంచి కాలువలకు, అక్కడ్నుంచి మళ్లీ ఇంజిన్లతో పొలాలు తడువుకోవాల్సిన దుస్థితిని రైతులు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.


పట్టిసీమ నీటిని తరలిస్తున్న పోలవరం కాలువను కాంక్రీట్ లైనింగ్‌తో సహా 130 కి.మీ వైఎస్ హయాంలో పూర్తిచేస్తే తర్వాత 42 కి.మీ దూరం కాలువను సక్రమంగా నిర్మించని కారణంగానే గండి పడిందన్నారు. మళ్లీ గండ్లు పడతాయన్న భయంతోనే పట్టిసీమకు గల 24 పంపులను వినియోగించే ధైర్యం చేయలేకపోతున్నట్టు చెప్పారు.

మరోవైపు గత రెండేళ్లలో ప్రకటించిన కరువు మండలాల రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని ఇంతవరకు అందించలేదని గుర్తుచేశారు. 2003లో కరువు సమయంలో ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. పుష్కరాల కోసం తీసుకున్న నీటిని గత రెండుమూడు రోజులుగా ఇస్తున్న ప్రభుత్వం, ఇదే పరిమాణంలో కంటిన్యూగా సరఫరా ఇస్తామని హామీనివ్వాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. రైతాంగం కోసం ఏ పార్టీలతోనైనా కలిసి పోరాడేందుకు తమ పార్టీ సిద్ధంగా వుందన్నారు. వీరితో పార్టీ రైతువిభాగం రాష్ట్ర కార్యదర్శి తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పెరికల కాంతారావు, యలవర్తి రామమోహనరావు, యలవర్తి నాగభూషణం, గాదె శివరామకృష్ణారెడ్డి, ఉయ్యూరు అప్పిరెడ్డి, రాపర్ల నరేంద్ర ఉన్నారు.

మరిన్ని వార్తలు