చంద్రబాబూ.. హైకోర్టు విభజనకు డెడ్‌లైన్ పెట్టుకోరా?

3 Oct, 2016 21:34 IST|Sakshi
చంద్రబాబూ.. హైకోర్టు విభజనకు డెడ్‌లైన్ పెట్టుకోరా?
- కక్షిదారుల ఇబ్బందులను దష్టిలో పెట్టుకోవాలి
- మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
 
సాక్షి, అమరావతి : ప్రజలు ఒక ప్రాంతంలో.. పాలన మరో ప్రాంతంలో.. ఉండకూడదని హైదరాబాద్‌లో పదేళ్ల హక్కుని వదులుకుని వెలగపూడి కేంద్రంగా పాలన ఆరంభించిన సీఎం చంద్రబాబు హైకోర్టు విభజనలో మాత్రం ఎందుకు చొరవ చూపడం లేదో చెప్పాలని మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకష్ణారెడ్డి (ఆర్కే) డిమాండ్ చేశారు. ఉద్యోగులకు డెడ్‌లైన్లు విధించి మరీ వెలగపూడి రప్పించిన చంద్రబాబు హైకోర్టు విభజనకు డెడ్‌లైన్ పెట్టుకోవాలని సూచించారు. రెండున్నరేళ్ల కాలంలో చంద్రబాబు హైకోర్టు విభజనపై ఎందుకు నోరు మెదపడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఏపీలో కక్షిదారుల్ని, వారి ఇబ్బందుల్ని దష్టిలో ఉంచుకుని హైకోర్టు విభజనకు కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌ను కలిసి ఉమ్మడి హైకోర్టును విభజించాలని కోరిందని, సీఎం చంద్రబాబు మాత్రం కేంద్రంలోని తన మంత్రులు, ఎంపీలతో ఎందుకు ఒత్తిడి చేయించడం లేదని ప్రశ్నించారు. పాలనా యంత్రాంగాన్ని మొత్తం అమరావతికి తరలించారని, హైకోర్టును విడగొట్టకుంటే ప్రభుత్వ పరంగా కేసులకు అధికారులు హైదరాబాద్ చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. హైకోర్టు విభజనపై చంద్రబాబు నోరు మెదపకుంటే, తెలంగాణ ఎంపీలు చంద్రబాబుపై చేసే ఆరోపణలకు ఊతమిచ్చినట్లవుతుందన్నారు. హైకోర్టును విభజించకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని తెలంగాణ ప్రతినిధులు పలుమార్లు విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. హైకోర్టు విభజనకు చంద్రబాబు అడ్డంకి అని గతంలో పార్లమెంట్ ఎదుట తెలంగాణ ఎంపీలు ఆందోళనలు చేశారన్నారు. 
 
మరిన్ని వార్తలు