జెడ్పీ పాలన.. ఇక ఆసక్తికరం

17 Oct, 2016 14:00 IST|Sakshi
మూడు నెలలకోసారి అందరూ కలవాల్సిందే.. 
ఇక నుంచి సమావేశాలకు నలుగురు కలెక్టర్లు రావాలి.. 
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు హాజరు 
కరీంనగర్‌ జెడ్పీ నుంచే నాలుగు జిల్లాల పర్యవేక్షణ
వైద్యబిల్లులు, జీపీఎఫ్‌ రుణాలకు తప్పని ఇబ్బందులు
 
ఉమ్మడి కరీంనగర్‌ నాలుగు జిల్లాలైనా... ఆ నాలుగు జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు మరో రెండున్నర సంవత్సరాల పాటు మూడు నెలలకోసారి కలిసే అవకాశం ఉంది. అందరూ కలిస్తే ఆ రోజు జిల్లా పరిషత్‌ పాలన ఆసక్తికరంగా మారనుంది. జిల్లాల పునర్విభజన జరిగినా జిల్లా పరిషత్‌ పాలనలో మాత్రం మరో రెండున్నరేళ్లు అంతగా మార్పు ఉండదు. కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సిబ్బందిని అలాగే ఉంచి ఒకే జెడ్పీ సీఈవోతో నాలుగు జిల్లాలను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు. ఇది కూడా కొన్ని చిక్కులను తెచ్చిపెట్టనుందనే ప్రచారం ఉన్నా... ముఖ్యంగా పాలనపై ఎలాంటి ప్రభావం పడుతుందనే చర్చ సాగుతోంది. ఈ నెల 11 నుంచి జిల్లాల విభజన అమల్లోకి రాగా... నాలుగు జిల్లాల్లో జెడ్పీపాలన తీరు తెన్నులు ఎలా ఉంటాయనేది అసక్తికరంగా మారింది. 
 
 
సాక్షి, కరీంనగర్‌ : ఏ జిల్లాలోనైనా గ్రామీణ ప్రాంతాలే అధికంగా ఉంటాయి. అందుకే ఈ గ్రామీణ ప్రాంతాలను పర్యవేక్షించే జిల్లా పరిషత్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ప్రత్యేకంగా జెడ్పీ అధ్యక్షులను నియమించి వారికి సహాయ మంత్రి హోదా కల్పిస్తారు. వీరి అధ్యక్షతన జిల్లా పరిధిలోని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలతో కలిసి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశాలను మినీ అసెంబ్లీ సమావేశాలుగా పిలుస్తారంటే వీటి ప్రాధాన్యం అంతటిది. అయితే జిల్లాల విభజన జరిగినా జెడ్పీ సమావేశాలను సుమారు మరో రెండున్నరేళ్లు కరీంనగర్‌లోనే నిర్వహించనున్నారు. ప్రస్తు తం జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించినా... ప్రతి మూడు నెలలకొకసారి నిర్వహించే జెడ్పీ సర్వసభ్య సమావేశాలకు, స్థాయి సంఘ సమావేశాలకు జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా కరీంనగర్‌కు రావాల్సిందే. సభ్యుల ప్రాంతాలు వేరే జిల్లాలో ఉన్నా సమావేశాలకు మాత్రం కరీంనగర్‌కు రావాలి.
 
కలెక్టర్లు లేదా జేసీలు తప్పనిసరి..
కీలక ప్రజాప్రతినిధులంతా హాజరయ్యే జెడ్పీ సర్వసభ్య సమావేశానికి సాధారణంగా అధికారయం త్రాంగం తరపున జిల్లా కలెక్టర్‌ హాజరవుతారు. ఒకవేళ కలెక్టర్‌ రాని పరిస్థితులలో జాయింట్‌ కలెక్టర్‌ హాజరవుతారు. నాలుగు జిల్లాలు ఏర్పడటంతో కరీం నగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు నలుగురు జెడ్పీ సమావేశ వేదికపై ఆసీనులు కావాల్సిందే. అన్ని ప్రభుత్వ శాఖల జిల్లాస్థాయి అధికారులు జెడ్పీ సమావేశానికి రావల్సిందే. జిల్లాలో దాదాపు 50కిపైగా ప్రధాన శాఖలుండగా, అనుబంధ శాఖలన్నింటిని కలిపి ఒకే శాఖగా మార్చడంతో నాలు గు జిల్లాల అధికారులంతా హాజరుకావాల్సి ఉంటుం ది. దీంతో జెడ్పీ సమావేశాలకు స్థలం సరిపోయే పరిస్థితి కన్పించడం లేదు. సమావేశాల్లో అజెండా వారిగా ఆయా శాఖల జిల్లాస్థాయి అధికారులు సభావేదికపైకి ఎక్కి సమాధానాలు ఇస్తుం టారు. ఇకనుంచి నాలుగు జిల్లాలకు సంబంధించి నలుగురు చొప్పున అధికారులు వేదికపైకి ఎక్కి ఏ జిల్లా సభ్యుడు ప్రశ్ని అడిగితే ఆ జిల్లాకు చెందిన అధికారి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
 
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిసే రోజు...
ఉమ్మడి కరీంనగర్‌ నుంచి విడిపోయిన నాలుగు జిల్లాల ప్రజాప్రతినిధులు కలిసేది ఆ ఒక్కరోజే. జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం దానికి వేదిక. కరీంనగర్‌ జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాలుగా ఏర్పడగా... ఈ జిల్లాకు చెందిన సుమారు పదకొండు మండలాలు భూపాలపల్లి, వరంగల్‌ అర్బన్, సిద్దిపేట జిల్లాలకు వెళ్లాయి. ఈ ఏడు జిల్లా ల్లో ఉన్న 57 మంది జెడ్పీటీసీ సభ్యులు జెడ్పీ సమావేశానికి హాజరవుతారు. అదేవిధంగా జగిత్యాల జిల్లాకు చెందిన జెడ్పీ చైర్మన్‌ తుల ఉమ అధ్యక్షతన జరిగే సమావేశానికి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు రాజేం దర్, కేటీఆర్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీలు కల్వకుంట్ల కవిత, బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఐదుగురు ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, స్వామిగౌడ్, పాతూరు సుధాకర్‌రెడ్డి, భానుప్రసాద్‌రావు, సంతోష్‌కుమార్, చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వొడితెల సతీష్‌రావు, దాసరి మనోహర్‌రెడ్డి, చెన్నమనేని రమేష్‌, బొడిగె శోభ, రసమయి బాలకిషన్, సోమారపు సత్యనారాయణ, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, పుట్ట మధు హాజరుకానున్నారు. జిల్లా విడిపోయిన తర్వా త మూడు నెలలకోసారి జరిగే సమావేశం మహామహుల హాజరుతో కలర్‌ఫుల్‌గా కనిపించనుంది. 
 
 
వైద్యబిల్లులు, జీపీఎఫ్‌ రుణాలకు ఇబ్బందే...
జెడ్పీ దస్త్రాలపై జెడ్పీ అధ్యక్షుడి సంతకంతోపాటు చాలా ఫైళ్లపై జిల్లా కలెక్టర్‌ ఆమోదం తప్పనిసరి కావడంతో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాకు పంపే దస్త్రాలలో కొంత ఇబ్బందులు తప్పవు. ఎక్కడి జిల్లాలో అక్కడి సభ్యులతో జెడ్పీ సమావేశం నిర్వహిస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నా... అలా చేస్తే పాలకవర్గంలో సరిపడా కోరం ఉండదు. కనుక ఇది సాధ్యపడదు. ఎందుకంటే కోరం ఉంటెనే జెడ్పీ సమావేశం నిర్వహించాలి. ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో జెడ్పీ సీఈవో ఉండాల్సిందే. అయితే నాలుగు జిల్లాలకు ఒకే సీఈవో హాజరు కాలేరు కనుక తక్కిన మూడు జిల్లాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారని భావిస్తున్నారు. సీఈవో మాత్రం నాలుగు జిల్లాలకు ఒక్కరే ఉంటారు. పంచాయతీ రాజ్‌ ఉద్యోగులకు వైద్యబిల్లులు రూ.50 వేలలోపు ఉంటే జెడ్పీ సీఈవో మంజూరీ చేస్తారు. దాటితే కలెక్టర్‌ ఆమోదిం చాక జెడ్పీ సీఈవో ఆ బిల్లు మంజూరీ చేస్తారు. జిల్లావ్యాప్తంగా మండల పరిషత్‌ కార్యాలయాలు జెడ్పీ పాఠశాలల బోధనేతర సిబ్బంది, ఆర్‌డబ్లు్యఎస్, పీఆర్‌ ఇంజనీరింగ్‌ విభాగాల కార్యాలయాల్లో 1500–2000 మంది పంచాయతీరాజ్‌ ఉద్యోగులున్నారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల ఉద్యోగులకు వైద్యబిల్లులు చెల్లింపులలో ఇబ్బందులు తప్పవు. 
మరిన్ని వార్తలు