చిహ్నం కోసం..

2 Oct, 2017 02:21 IST|Sakshi

రెండాకుల గుర్తు కోసం అన్నాడీఎంకే వర్గాల కసరత్తు

పోటా పోటీగా ప్రమాణ పత్రాల సమర్పణ

మరో నాలుగు రోజుల్లో విచారణ

రెండాకుల చిహ్నం కోసం కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎదుట లక్షలాదిగా ప్రమాణ పత్రాలను ఈపీఎస్, ఓపీఎస్, టీటీవీ శిబిరాలు సమర్పించి ఉన్నాయి. ప్రమాణ పత్రాల సమర్పణ పర్వం ముగియడంతో ఆరో తేదీన విచారణ నిర్వహించేందుకు సీఈసీ వర్గాలు నిర్ణయించాయి. చిహ్నం తమకే దక్కుతుందని ఎవరికి వారు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

సాక్షి, చెన్నై : జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పార్టీ రెండాకుల చిహ్నం కైవసం లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం  పన్నీర్‌ సెల్వం శిబిరాల ఏకంతో అందుకు తగ్గ ప్రమాణ పత్రాలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చేరాయి. అయితే, ఇరు శిబిరాల ఏకంతో పాటుగా సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు, తదుపరి సాగిన పరిణామాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి తెచ్చేందుకు సీఎం, డిప్యూటీ శిబిరాలు సిద్ధమయ్యాయి. అలాగే, అన్నాడీఎంకే తమదేనన్నట్టు చిన్నమ్మ శశికళ తరపున ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ సైతం తన వద్ద ఉన్న ప్రమాణ పత్రాలు, వివరాలతో కూడిన ఆధారాలను సీఈసీకి సమర్పించారు.  కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన గడువు శనివారంతో ముగియడంతో ఆ రోజున  ప్రమాణ పత్రాలు చెన్నై నుంచి ఢిల్లీకి లారీల్లో తరలించి మరీ దాఖలు చేయడం గమనార్హం.

6న విచారణ
సీఈసీ ఇచ్చిన గడువు శనివారంతో ముగిసింది. దీంతో  ఆ రోజున తమ వద్ద ఉన్న అన్ని వివరాలు, ప్రమాణ పత్రాలను లక్షలాదిగా సీఎం, డిప్యూటీ, దినకరన్‌ శిబిరాలు వేర్వేరుగా దాఖలు చేశాయి. సీఎం, డిప్యూటీల తరఫున మంత్రులు జయకుమార్, సీవీ షణ్ముగం, ఉదయకుమార్, సీనియర్లు కేపి మునుస్వామి, మనోజ్‌ పాండియన్, ఎంపీ మైత్రేయన్‌ ఢిల్లీ వెళ్లి అన్ని వివరాలను అందించారు. దినకరన్‌ తరఫున కర్ణాటక పార్టీ నేత పుహలేంది నేతృత్వంలోని బృందం ప్రమాణ పత్రాలను సమర్పించాయి. ఈ పర్వం ముగియడంతో ముందుగా నిర్ణయించిన మేరకు ఆరో తేదీన రెండాకుల చిహ్నం కైవసం వ్యవహారం విచారణకు సీఈసీ చేపట్టనుంది. దీంతో ఆ చిహ్నం దక్కేదెవరికో అన్న ఉత్కంఠ పెరిగింది. అదే సమయంలో తమకు మరో రెండు రోజులు గడువు ఇస్తే, అదనంగా ప్రమాణ పత్రాలు దాఖలు చేస్తామని మరో మారు దినకరన్‌ అభ్యర్థించగా సీఈసీ నిరాకరించింది. ఈ విషయంగా దినకరన్‌ను ప్రశ్నించగా, తమ వద్ద ఉన్న ఆధారాలన్నీ సమర్పించామని, ఆ చిహ్నం తమకు దక్కుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేలోని స్లీపర్‌ సెల్‌ ఎమ్మెల్యేలు మరి కొద్ది రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే నిర్ణయాన్ని తీసుకోవడం ఖాయం అని పేర్కొన్నారు.

ప్రభుత్వ కుప్పకూలడం ఖాయం : స్టాలిన్‌
అన్నాడీఎంకే పరిణామాలపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ సర్కారు ఘనత ఏపాటితో ఆర్థిక పరిస్థితి స్పష్టం చేస్తోందని విమర్శిస్తూ, మోదీ అభయం ఉన్నా, ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లడం ఖాయం అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే మాజీ ఎంపీ కేసీ పళని స్వామి సీఈసీ వద్ద ప్రత్యేకంగా ఓ లేఖను సమర్పించడం గమనార్హం. అందులో అన్నాడీఎంకే నియమ నిబంధనలు గతంలో ఉన్నవే అనుసరించే రీతిలో సీఈసీ నిర్ణయం తీసుకోవాలని అందులో కోరారు.

మరిన్ని వార్తలు